బోధనలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ప్రభుత్వ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలు పెంపునకు కృషి చేయాలని ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
దిశ, గంభీరావుపేట : ప్రభుత్వ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలు పెంపునకు కృషి చేయాలని ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ స్కూల్, దమ్మన్నపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
వారి సందేహాలు నివృత్తి చేశారు. పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు. విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అంశాల్లో నిష్ణాతులను చేయాలని సూచించారు. అనంతరం విద్యాలయం ఆవరణలో పరిశుభ్రత పనులు పరిశీలించారు. కిచెన్ లోకి వెళ్లి కూరగాయలు, పండ్లు ఇతర పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లారు. ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తుండగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.