ఎమ్మెల్యే సంజయ్ బహిరంగ చర్చకు సిద్ధమా: భోగ శ్రావణి సంచలన ప్రెస్ మీట్
ఎంపీ అరవింద్ పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి: ఎంపీ అరవింద్ పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ నాయకులు కబ్జాకోరులని మాట్లాడిన సంజయ్ తన అనుచరులు ఇసుక దందా చేస్తున్నారనే విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ దందాలో ఎమ్మెల్యేకు కూడా వాటా ఉందని ఆమె అన్నారు.
అవసరమైతే ఈ విషయంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ఎమ్మెల్యే కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు చేసే కబ్జాలు, అక్రమ ఇసుక దందాను బీజేపీ నాయకులకు ఆపాదించడం సరి కాదని హితవు పలికారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధోరణి రెండు నాల్కల వలే ఉంటుందని, మన ముందు ఒకటి మాట్లాడి.. వెనక మరొటి మాట్లాడుతారని మండిపడ్డారు. ఆయన వేధింపుల వల్లే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తే ఒక తండ్రిగా పిలిచి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించనట్లుగానే ఉందని ఆరోపించారు.
ఆరోపణలు ఎదర్కొంటున్న ఎమ్మెల్యే సచ్ఛీలుడే అయితే మున్సిపల్ పార్క్ అభివృద్ధి పనుల్లో ఆలస్యం చేస్తున్నారని మహిళ అధికారిని వెళ్లగొట్టారు. కానీ, రూ.50లక్షలు మంజూరైన ఆ పార్క్ అభివృద్ధి పనులు ఏడాదిన్నరగా ఎందుకు చేపట్టడం లేదో సమాధానం చెప్పాలన్నారు. యాక్షన్, డైరెక్షన్ చేయించడంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిట్ట అని అన్నారు. ప్రజలు, పార్టీ అధిష్టానం ముందు కౌన్సిలర్లను బద్నాం చేసింది ఎమ్మెల్యే కాదా అని నిప్పులు చెరిగారు.
త్వరలో ఎమ్మెల్యే బాధితుల సంఘం..
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు వాస్తవమేనని తెలిపిన శ్రావణి త్వరలో ఎమ్మెల్యే బాధితుల సంఘం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. సంఘం ఏర్పాటు చేస్తే అందులో చేరే వారు చాలామందే ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సమావేశంలో జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్, పడాల తిరుపతి, పట్టణాధ్యక్షులు వీరబత్తిని అనీల్ కుమార్, సారంగాపూర్ మండలాధ్యక్షుడు ఎండబెట్ట వరుణ్ కుమార్, శ్రీనివాస్, జున్ను రాజేందర్ బొద్దుల గజేందర్, శ్రీనివాస్, నక్క జీవన్, తదితరులు పాల్గొన్నారు.