ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కొప్పుల కౌంటర్..
అభివృద్ధి, సంక్షేమం పై బహిరంగ చర్చకు సిద్ధమా అని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విసిరిన సవాల్ కు మంత్రి కొప్పుల కౌంటర్ ఇచ్చారు.
దిశ, బీర్పూర్ : అభివృద్ధి, సంక్షేమం పై బహిరంగ చర్చకు సిద్ధమా అని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విసిరిన సవాల్ కు మంత్రి కొప్పుల కౌంటర్ ఇచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ వసంతతో రోళ్లవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం కొంతమంది స్థానిక రైతుల సమక్షంలో అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక సీనియర్ నాయకుడు రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడడం పద్ధతి కాదని హితవు పలికారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని అందులో బాగంగానే 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
కళ్ళముందే గోదావరిలో వేల టీఎంసీల నీరు వృధాగా పోతే చూస్తూ కూర్చున్నారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేక పోయారని ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటిని అందించగలుగుతున్నామన్నారు. చెరువులు నిండు కుండలా నింపామని నేడు రాష్ట్రంలో పంటలు పుష్కలంగా పండుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు అని మాట్లాడుతున్నారు. వచ్చే వారం రోజుల్లో జగిత్యాల జిల్లా కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి సమాచారం ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చర్చకు సిద్ధమే అయినప్పటికీ కలవడం ఎలా వీలవుతుంది? ఎక్కడ వాళ్ళను అక్కడే ఆపేస్తారు కదా అని తెలిపారు. ఇవాళ రోళ్ల వాగు ప్రాజెక్టు గురించి మాట్లాడమని ఏమైనా అభ్యంతరాలు ఉంటే రేపు వారు కూడా మాట్లాడొచ్చని అన్నారు.