సీఎంపై పోటీ.. ఎమ్యెల్యే ఈటలకు స్ట్రాంగ్ కౌంటర్
సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఆయనపై తాను పోటీ చేస్తానని హుజురాబాద్‌లో కార్యకర్తల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్‌కు దమ్ముంటే గజ్వేల్‌లో మాత్రమే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో మాట్లాడిన మంత్రి గుంగుల తెలంగాణలో బీజేపీకి వచ్చే సీట్లు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు.
అందుకే ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తామని చెబుతున్నారని గుంగుల తెలిపారు. హుజూరాబాద్‌లో కూడా ఈటల పోటీ చేస్తున్నారంటే ఆయన భయపడ్డారా అని ప్రశ్నించారు. వైఎస్ షర్మిల, కేఏపాల్, కేవీపీ రామచందర్‌రావు, కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో ఏం పని అని, వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు. బీజేపీ పేరు చెప్పి తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.