డబుల్ బెడ్రూం ఇంటి కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించలేదని, తనకు అన్యాయం జరిగిందంటూ ఓ వ్యక్తి చొప్పదండి...Latest News of Choppadhandi
దిశ, కరీంనగర్ బ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించలేదని, తనకు అన్యాయం జరిగిందంటూ ఓ వ్యక్తి చొప్పదండి మండల కేంద్రంలో తన ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుని కథనం ప్రకారం... చొప్పదండి మండల కేంద్రానికి చెందిన చిద్యాల సురేష్ గత 50 ఏళ్లుగా చొప్పదండి మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా చొప్పదండికి నివాసినని స్పష్టం చేస్తున్నా, తాను స్థానికేతరుడినని జాబితా నుంచి తన భార్య పేరు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాథరి కులానికి చెందిన తనకు సొంత ఇల్లు కూడా లేదన్నాడు. డబుల్ బెడ్ రూం అర్హుల లిస్టులో తన పేరు లేకపోవడంతో చొప్పదండి ఎన్టీఅర్ విగ్రహం వద్ద ఒంటిపై డిజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇదే ప్రాంతంలో బీజేపీ కార్నర్ మీటింగ్ జరుగుతుండడంతో సమావేశానికి హాజరైన నాయకులు, స్థానికులు సురేష్ ను నిలువరించారు. సురేష్ వద్ద ఉన్న డిజిల్, అగ్గిపెట్టెని లాక్కుని అతన్ని సముదాయించారు.
ఇదే కారణమా..?
అయితే సురేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం వెనక కారణం నెట్టింట వైరల్ అయిన జాబితే కారణమని తెలుస్తోంది. డబుల్ ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్ ఇదేనంటూ కొంతమంది చొప్పదండి ప్రాంత వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో అందులో తన పేరు లేదని తెలుసుకున్న సురేష్ వేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. అధికారికంగా వెలువడాల్సిన జాబితా నెట్టింట వైరల్ కావడమే ఇందు కారణమని స్థానికులు అంటున్నారు.