కొండగట్టు కాషాయమయం

చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

Update: 2023-04-05 02:17 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి /మల్యాల : చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మంగళవారం మొదలైన ఉత్సవాలు ఏప్రిల్ 6వరకు మూడు రోజులపాటు జరుగనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా హనుమాన్ భక్తులు పెద్దఎత్తున అంజన్న క్షేత్రానికి తరలివస్తున్నారు. కొంతమంది హనుమాన్ దీక్షాపరులు దూర ప్రాంతాల నుంచి కాలినడకన కొండకు చేరుకుంటున్నారు. దీంతో కొండగట్టు అంజన్న క్షేత్రం కాషాయమయంగా మారిపోయింది. జై హనుమాన్ నామస్మరణతో అంజన్న క్షేత్రం మారుమోగుతోంది. అయితే జయంతి ఉత్సవాలకు తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

దారులన్నీ కొండగట్టుకే..

హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో రహదారులన్నీ కొండకు వచ్చే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాలినడకన వస్తున్న భక్తుల కోసం దిగువ కొండగట్టు ప్రాంతం నుంచి పైవరకు మధ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కేవలం తెలంగాణనుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఎండాకాలం కావడంతో ప్రధానాలయం ఆవరణతోపాటు గుట్టపై ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేశారు. టికెట్‌ కౌంటర్లు, స్వామి వారి దర్శనానికి క్యూ లైన్లు, బారికేడ్లను నిర్మించారు. మాల విరమణ మండపం ఎదుట భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక సెల్లార్లు నిర్మించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ ఎత్తున పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేయడంతోపాటు సీసీ కెమెరాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శానిటైజేషన్ కోసం 600మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో అందుబాటులో ఉంటారని ఆలయ అధికారులు తెలిపారు.

కాలినడకన వచ్చే భక్తులు జాగ్రత్త..!

సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడం రాత్రి సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో రోడ్డు ప్రమాదాల్లో హనుమాన్ మాలదారులు మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. కాబట్టి రాత్రివేళ నడక దారిలో వచ్చే భక్తులు రేడియం స్టిక్కర్లు కలిగిన సేఫ్టీ జాకెట్లు ధరించడం ఉత్తమం. వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వెంట వాటర్ బాటిల్ క్యారీ చేయడం వల్ల డిహైడ్రేషన్‌కు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలి.

Tags:    

Similar News