పర్యాటక ప్రాంతాల్లో అగ్రస్థానంలో కరీంనగర్ : మంత్రి కమలాకర్

మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలతో పర్యాటకంగా దేశ చిత్రపటంలో కరీంనగర్ అగ్రస్థానంలో నిలువనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Update: 2023-02-22 13:21 GMT

దిశ, కరీంనగర్ టౌన్ : మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలతో పర్యాటకంగా దేశ చిత్రపటంలో కరీంనగర్ అగ్రస్థానంలో నిలువనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మానేర్ తీగల వంతెన వద్ద నిర్మించనున్న ఐలాండ్ పనులను మంత్రి గంగుల కమలాకర్ బుధవారం పరిశీలించారు. ఐలాండ్ల డిజైన్ లలో చేయాల్సిన మార్పులు చేర్పులను కాంట్రాక్టర్ కు అధికారులకు సూచించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, కాంట్రాక్టర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్చి 31వ తేదీలోగా కేబుల్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కేబుల్ బ్రిడ్జి ప్రారంభమయ్యే లోగా ఐలాండ్ ల పనులను పూర్తి చేస్తామన్నారు.

    కరీంనగర్ లో నిర్మించబోయే ఐలాండ్ లు నగరానికి సరికొత్త శోభను తీసుకురానున్నాయని పేర్కొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయని, ఆగష్టు లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ లో ప్రపంచంలోనే 3వదైన అతిపెద్ద ఫౌంటెన్ ను రూ.60 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇప్పటికే ఫౌంటెన్ టెండర్ ప్రక్రియ పూర్తి కాగా వారం రోజుల్లోగా భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభిస్తామన్నారు. మరోవైపు కేబుల్ బ్రిడ్జి పై డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని, ఈ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ కేబుల్ బ్రిడ్జికి ప్రధాన ఆకర్షణగా నిలువనుందని తెలిపారు. ఈ నిర్మాణాలన్ని పూర్తైతే కరీంనగర్ రూపురేఖలు మారి గొప్ప నగరంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, సూడ చైర్మన్ జీవీ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లవత్, ఆర్డీవో ఆనంద కుమార్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News