హుజురాబాద్‌లో ఇకనుండి జీ హుజూర్ రాజకీయాలను నడవవు : హరీష్ రావు

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇకనుండి జీ హుజూర్ రాజకీయాలు నడవవని

Update: 2023-11-10 13:14 GMT

దిశ, జమ్మికుంట : హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇకనుండి జీ హుజూర్ రాజకీయాలు నడవవని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన రోడ్ షో లో భాగంగా పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద హరీష్ రావు మాట్లాడారు. సర్వేలన్నీ కూడా కౌశిక్ రెడ్డి గెలుస్తాడని చెబుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మండిపడ్డారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని దోషం చెప్పారు. ప్రతిపక్షాల మాటలకు మోసపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న టికెట్ ఇచ్చి ఇవాళ గుంజుకున్నారని, పొద్దుగాల ఇచ్చి సాయంత్రం గుంజుకున్నారని, ఆ పార్టీలో నాయకుల టికెట్లకు గ్యారెంటీ లేదని ఇక ఆరు గ్యారంటీలకు గ్యారంటీ ఎక్కడ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాళ్లు పైకి పెట్టి తలకాయ కిందికి పెట్టిన బీజేపీ రాష్ట్రంలో గెలిచేది కేవలం మూడు సీట్లు మాత్రమేనని, బీజేపీ చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ అని ఢిల్లీ నుంచి వస్తున్న పెద్దలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం అవుతలేదని ఎద్దేవా చేశారు.

ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గం లో తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని, ఈటెల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిందని విమర్శించారు. పెద్దాయనపై పోటీ చేసినంత మాత్రాన పెద్దవారు కారని, గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష మెజారిటీతో, హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవటం ఖాయమన్నారు. ఏడుసార్లు ఈటలకు అవకాశం కల్పించారని, ఒక్కసారి కౌశిక్ రెడ్డికి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. పదవుల కోసం ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని, సమైక్యవాదులైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లతో జతకట్టాడని ఘాటుగా విమర్శించారు. అదే విధంగా హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు.

తనను అత్యధిక మెజార్టీతో ప్రజల ఆశీర్వదిస్తే హుజురాబాద్ నియోజకవర్గాన్ని కని విని ఎరుగని రీతిలో మరో సిద్దిపేట, గజ్వేల్ లాగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులు ఓటును అభ్యర్థిస్తుంటే అవహేళన చేస్తూ మాట్లాడారని, ఈటల రాజేందర్ కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచి, ఉప ఎన్నికల్లో ఇక్కడి ప్రజలను నమ్మకద్రోహం చేసి గజ్వేల్ కు వెళ్లాడని ఘాటు స్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని కోటి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News