ఇండియా పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) కప్ బీజేపీదే
ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
దిశ, కరీంనగర్ రూరల్ : ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం రేకుర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బూత్ విజయ సంకల్ప అభియాన్ సభలో బండి సంజయ్ తోపాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికలను క్రికెట్ తో పోలుస్తూ... హాట్ కామెంట్స్ చేశారు. ఒకవైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం బరిలో దిగిందని, మరోవైపు ఐఎన్డీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నాయని, ఆ కూటమి టీంను చిత్తుగా ఓడించి 400 స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అన్నారు. దేశంలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ
తెలంగాణ పొలిటికల్ లీగ్ (టీపీఎల్) ఆట మొదలైందన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తనతోసహా 17 మంది సభ్యుల టీం బరిలోకి దిగామన్నారు. అటువైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ గుంట నక్కల టీంలు బరిలో దిగాయని, వేర్వేరుగా బీజేపీని ఓడించడం సాధ్యం కాదని.. చీకటి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు ఒక్కటైనాయని, అయినప్పటికీ ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి టీపీఎల్ కప్ ను గెలిచి మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నామన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాశులు పోసినా ఎవరూ కొనేనాథుడే లేరన్నారు. తాలు, తరుగు పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులను మోసం చేస్తే మిల్లర్ల, వ్యాపారుల లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు వారు వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి మోసం చేశారని, దాంతో కాంగ్రెస్ పార్టీ లైసెన్స్ ను
కూడా ప్రజలు రద్దు చేయబోతున్నారని పేర్కొన్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే... 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ కు స్వతంత్ర్యం కల్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వం మోదీ దే అన్నారు. ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసింది, రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ బీజేపీయేనని, రాముడు కాంగ్రెసోళ్లకు, బీఆర్ఎసోళ్లకు దేవుడేనట... మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వాళ్లు ఎన్నడైనా కరసేవ చేశారా? బలిదానాలకు సిద్ధమయ్యారా? కరసేవ చేసి బలిదానం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీనే అన్నారు. హిందూ సమాజంపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ ను ప్రకటించినప్పుడే.. వాళ్ల కుట్రలు ఏందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. హిందూ
సమాజమంతా ఏకమై బుద్ది చెప్పాలని, హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్నది బీజేపీయేనని, బీజేపీని గెలిపించకపోతే.. హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడే వాళ్లే ఉండరనే విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అట్లాంటప్పుడు కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లేస్తే మురిగిపోయినట్లే.. రాష్రాన్ని అభివృద్ధి చేసేది...చేసింది బీజేపీయే... కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసే బాధ్యత తమదేనన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కాకపోతే ఈ దేశం పరిస్థితి ఎట్లా ఉంటదో ఒక్కసారి ఆలోచించి ఓటెయ్యాలని కోరారు. ప్రజలు కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే... మోదీకి నా ఓటేసి ప్రధానిని మళ్లీ చేసుకుందామన్నారు. కార్యకర్తలంతా ఈ విషయాన్ని ఇంటింటికీ తీసుకెళ్లి బీజేపీని అత్యధికంగా గెలిపించి కరీంనగర్ దమ్ము చూపాలని రోరారు.