కరీంనగర్‌లో కలకలం రేపుతోన్న అంతుచిక్కని వ్యాధి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
కరీంనగర్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఒకే వ్యాధి లక్షణాలతో ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
దిశ, కరీంనగర్ బ్యూరో: ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది. మిస్టరీ మరణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా రక్తం కక్కుతూ చనిపోయారు. మొదట తల్లి, కూతురు, కొడుకు, ఇప్పుడు తండ్రి ఇలా వరస మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధరలో జరుగుతున్న మిస్టరీ చావుల గురించి విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంతుచిక్కని వ్యాధితో మృత్యువు ఒడిలో చేరిపోతున్న ఆ కుటుంబం గురించే చర్చ సాగుతోంది.
నలుగురు @ 45 రోజులు..
అంతు చిక్కని వ్యాధి ఆ కుటుంబాన్ని చిద్రం చేస్తోంది. అప్పులు తెచ్చి ఆస్పత్రుల బిల్లులు చెల్లిస్తున్నా బ్రతికి బట్టకట్టిన వారు మాత్రం ఎవరూ లేరు. చిన్నారుల కేరింతలు, తల్లిదండ్రులు వారింపుల నడుమ జీవనం సాగించాల్సిన ఆ కుటుంబం ఇప్పుడు విషాదంలో కూరుకుపోయింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఇద్దరు చిన్నారులతో సహా తల్లిదండ్రులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టిస్తోంది. నవంబర్ 16న కొడుకు అద్వైత్, డిసెంబర్ 4న కూతురు అమూల్య, డిసెంబర్ 16న తల్లి మమత, డిసెంబర్ 31 తండ్రి శ్రీకాంత్ ఒకే రకమైన వ్యాధితో మరణించడం ఆందోళన కల్గిస్తున్నది. కొడుకు, కూతురు, భార్యలకు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో వైద్యం అందించిన ప్రాణాలు దక్కకపోగా శుక్రవారం అర్థరాత్రి అనారోగ్యానికి గురైన శ్రీకాంత్‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా శనివారం తెల్లవారు జామున మరణించాడు.
వీరికి సోకిన వ్యాధి ఏంటీ అన్నదే అంతుచిక్కకపోవడమే మిస్టరీగా మారిపోయింది. మొదట హైదరాబాద్‌లో చికిత్స పొందిన చిన్నారులు, తల్లి విషయంలో కూడా అక్కడి డాక్టర్లు వీరికి సోకిన వ్యాధిని నిర్ధారించలేకపోయారని మృతుల బంధువులు చెప్తున్నారు. గంగాధరకు చెందిన వేముల లక్ష్మీపతి, శాంతమ్మల దంపతులు వృత్తిరీత్యా కొంతకాలం ముంబాయికి వెల్లి జీవనోపాధి పొంది 20 ఏళ్ల క్రితం తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. గంగాధరలో పిండి గిర్నీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీపతి కుమారుడు శ్రీకాంత్‌కు చొప్పదండికి చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా వీరికి కూతురు అమూల్య (6), కుమారుడు అద్వైత్ (20నెలలు) జన్మించారు. శ్రీకాంత్ భార్య పిల్లలు రక్తంతో వాంతులు చేసుకుంటూ చికిత్స పొందుతూ మరణించడం ఆందోళనకు గురి చేస్తోంది.
అంతు చిక్కని వ్యాధి బారిన పడి శ్రీకాంత్ భార్య మమత, కూతురు అమూల్య, కొడుకు అద్వైత్‌లు మరణించడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శ్రీకాంత్ తల్లిదండ్రుల రక్త నమూనాలను సేకరించి హైదరాబాదు ప్రయోగశాలకు పంపించారు. అలాగే విచిత్రమైన వ్యాధితో మరణించిన తల్లి, చిన్నారులకు సంబంధించిన కొన్ని శరీర బాగాలను కూడా ఫోర్సెనిక్‌కు పంపించారు. ఇందుకు సంబంధించిన నివేదికలు ఇంకా రాకముందే శ్రీకాంత్ కూడా చనిపోవడం స్థానికులను కలవరపరుస్తోంది. మరో వైపున వీరి ఇంటి ఆవరణలోని బావి నీటిని పరీక్షించిన అధికారులు అవి కలుషితం కాలేదని తేల్చారు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న క్రమంలో ఓ సారి కిడ్నీలు పనిచేయలేదని, మరోసారి గుండె పని చేయలేదని వైద్యం అందించినా రికవరీ కాలేదని మృతుల బంధువులు తెలిపారు.
పోలీసుల కేసు నమోదు..
అయితే శ్రీకాంత్ అత్త పోలీసులను ఆశ్రయించి అనుమానస్పద మరణాలపై ఫిర్యాదు చేశారు. తన కూతురు మమత, మనవరాలు, మనవని మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని అందులో పేర్కొనడంతో పోలీసులు కూడా మిస్టరీ డెత్‌గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా శ్రీకాంత్ కూడా అదేరకమైన వ్యాధితో మరణించడం సంచలనం కల్గిస్తోంది. జన్యుపర లోపాలా లేక ఇతరాత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీకాంత్ పైనే అత్తింటి వారు అనుమానం వ్యక్తం చేసినట్టుగా కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అతను ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్నాడని సైన్స్ ల్యాబ్‌కు సంబంధించిన కెమికల్స్ వారిపై ప్రయోగించాడని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
ఓ కీలక ప్రజా ప్రతినిది కూడా పోలీసులకు ఫోన్ చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించిన క్రమంలో గంగాధర వాసులు కూడా సదరు ప్రజా ప్రతినిధి వద్దకు వెల్లి శ్రీకాంత్ అటువంటి వ్యక్తి కాదని వివరించినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీకాంత్ గురించి కొంతమంది అతను పనిచేస్తున్న కాలేజీకి వెల్లి కూడా ఆరా తీయడంతో సదరు కాలేజీ యాజమాన్యం అతని ఉద్యోగం మానుకోవాలని సూచించడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నట్టు చెప్తున్నారు. దీంతో అటు కుటుంబ సభ్యులను కోల్పోయి ఇటు ఉద్యోగాన్ని వదులుకున్న శ్రీకాంత్ మానసిక వేదనకు గురయ్యే వాడని కూడా అతని బంధువులు చెప్తున్నారు. అయితే శ్రీకాంత్‌ది ఆత్మహత్యా లేక అనారోగ్య మరణమా అని కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ అతని భార్య, పిల్లలు చనిపోయే ముందు రక్తం కక్కుతూ చనిపోయినట్టుగా ఆయన కూడా అలాగే మరణించాడని స్థానికులు చెప్తున్నారు.
మిస్టరీ చావులు..
వేముల శ్రీకాంత్ కుటుంబం అంతా ఒకే విధమైన వ్యాధి సోకి మరణించినట్టుగా చెప్తున్న క్రమంలో వీరి మరణం మిస్టరీగా మారిపోయింది. మమత, అమూల్య, అద్వైత్‌లు అనారోగ్యానికి గురైనప్పుడు వారిని పరీక్షించిన వైద్యులు ఎలాంటి రోగం నిర్దారణ కాలేదని చెప్పారు. వారికి సోకిన వ్యాధి ఏంటోనన్నదే వైద్య పరీక్షల్లోనూ తేలకపోవడంతో వారివి మిస్టరీ మరణాలుగానే మారిపోయాయి. తాజాగా శ్రీకాంత్ కూడా అదే విధంగా తనువు చాలిండచంతో అంతుచిక్కని వ్యాధి గురించి స్థానికులు చర్చించుకుంటున్నారు.
Also Read..
కరీంనగర్‌లో కలకలం రేపుతోన్న అంతుచిక్కని వ్యాధి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి