రైతన్నలు రంది పెట్టుకోవద్దు... ధైర్యంగా ఉండాలి : మంత్రి కేటీఆర్
రైతున్నలు రంది పెట్టుకోవద్దు.. ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు.
దిశ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రైతున్నలు రంది పెట్టుకోవద్దు.. ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానకు పంట నష్టపోయిన అన్నదాతలకు భరోసానిచ్చారు. జిల్లా ముస్తాబాద్ మండలం గోపాలపల్లి గుంటపల్లి చెరువుతండా గ్రామాలు, వీర్నపల్లి మండల కేంద్రంలో క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని మంగళవారం మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శించి అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కుప్పలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు.
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం..
అన్నదాతలు అధైర్యపడొద్దని, కేసీఆర్‌పై నమ్మకం ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు. ఇప్పటికే పంట నష్టం వివరాలను అధికారులు నమోదు చేశారని మంత్రి రైతులకు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ ప్రకటిత సహాయం రైతులకు వారి ఊరికే వచ్చి అధికారులు అందజేస్తారని తెలిపారు. లావుణి పట్టా కలిగిన రైతులకు కూడా పంట నష్టం సాయం అందుతుందన్నారు. మాది పేదోళ్ల ప్రభుత్వం, రైతుల పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. అన్నదాతలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.
దేశానికే అన్నం పెట్టే అన్నదాతలను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని పేర్కొన్నారు. త్వరలోనే గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు లేని పేదలు తమకు ఉన్న 60-70 గజాల్లో ఇండ్లు నిర్మించుకుంటే రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇళ్ల జాగాలేని పేదలకు ఇంటి స్థలాలను కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అనంతరం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం స్టేట్ ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఇటీవల సీఎం కేసీఆర్ ఐదు జిల్లాల్లో స్వయంగా పర్యటించి స్వయంగా పంటలను పరిశీలించి, రైతులకు భరోసానిచ్చారన్నారు. వడగళ్ల వానలు రైతుల నోట్లో మన్నుకొట్టాయని, పుష్కలంగా నీరుండడంతో సమృద్ధిగా పంట చేతికివచ్చిందన్నారు. తమ ప్రభుత్వం అంటేనే భారత రైతు సమితి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ 13 మండలాల్లో ఐదు దఫాలుగా కురిసిన అకాల వర్షాలకు ఇప్పటి వరకూ 19 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.
అకాల వర్షాలకు దెబ్బతిన్న రంగు మారిన మొలకెత్తిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి కేటీఆర్ అభయమిచ్చారు. రాష్ట్రంలోని రైతులంతా విశ్వాసంతో ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. స్వయంగా సీఎం కేసీఆర్ రైతు కావడం, గ్రామీణ ప్రాంతాల సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టే రైతుల సంక్షేమార్థం రైతుబంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే ఏడున్నర లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయానికి నాలుగు లక్షల టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు మనోధైర్యాన్ని కల్పించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంట నష్టం వివరాలను ఇప్పటికే అధికారులు అందజేశారని,
త్వరలోనే డబ్బు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మెన్ చిక్కాల రామారావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్. ఖీమ్యా నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, ఆర్డివో టి శ్రీనివాసరావు, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.