Congress Sirisilla Incharge : నౌకరీ పోతదని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు..

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పాలసీ లేదని కేసీఆర్ విమర్శిస్తున్నాడని, కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలసీ అని, అందుకే సబ్బండ వర్గాల ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టామని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-28 10:36 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పాలసీ లేదని కేసీఆర్ విమర్శిస్తున్నాడని, కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలసీ అని, అందుకే సబ్బండ వర్గాల ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టామని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోని పాలసీలన్నీ స్కాములేనని, పాలసీల పేరుతో అందిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన నౌకరి పోతుందనే ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చారని, అవినీతి అక్రమాలు బయటపడతాయని భయంతోనే అసెంబ్లీకి రావడం లేదని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల బ్యాచ్ అంతా విహారయాత్రకు వెళ్లినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లారని, పగటి వేషగాళ్ళకు పని మొదలైనట్లు కేసీఆర్ కు తగ్గట్టు కొడుకు, అల్లుడు ఇంగిత జ్ఞానం లేకుండా అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కేవలం 38,500 కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించిందని, కేవలం కమీషన్ల కోసమే గుట్టను తవ్వి ఎలుకను పట్టినట్టు కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారని విమర్శించారు. మేడిగడ్డ నిర్మాణం దశలోనే మేలు కాదని నిపుణులు చెప్పారని, కానీ కేసీఆరే ఇంజనీరై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడన్నారు. కేటీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాలి గోరంతైన తెలియదని, వాళ్లే ప్రాజెక్టు కట్టి వాళ్లే కూల్చి, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును నిర్వీర్యం చేశారన్నారు. ప్రాజెక్టు గేట్లు మూస్తే జలప్రళయం వచ్చి అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రభుత్వానికి నివేదిక అందించిందని, ప్రాజెక్టును అన్ని రకాలుగా బాగు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ నేత కార్మికుల సమస్యల గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నేత కార్మికుల ఆత్మహత్యల బండారం, ప్రభుత్వ భూమిని దాన దత్తం చేసిన బండారాన్ని అతిత్వరలో బయటపెడతామన్నారు. సమస్యలు సలహాలు ఇస్తే స్వాగతిస్తామని, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పై దుమ్మెత్తి పోస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, గడ్డం నర్సయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, పట్టణ అధ్యక్షురాలు వెల్ముల స్వరూప, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరీ బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, చేనేత సెల్ అధ్యక్షుడు గోనే ఏళ్ళప్ప, కార్యదర్శి పిట్టల దేవరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News