Collector : వీటీడీఏ పనుల్లో వేగం పెంచాలి..
వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వీటీడీఏ పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీటీడీఏ పనులు ఎప్పుడు మొదలు పెట్టారో, ఎంతవరకు పనులు పూర్తి అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుడి చెరువులో బండ్ అండ్ పార్క్ నిర్మాణ పనులను రూ. 12 కోట్లతో మొదలు పెట్టామని, వచ్చే నెలాఖరులోగా పూర్తిచేస్తామని టూరిజం శాఖ అధికారులు తెలిపారు.
బండ్ పార్క్ పనుల్లో భాగంగా నటరాజ, సూర్య నమస్కారం విగ్రహాలు, అంఫీథియేటర్, ఇంటర్నల్ పాత్ వే, జోన్ వన్ ప్లాంటేషన్ పూర్తి కాగా, లాండ్ స్కేప్, గ్రానైట్ ఫ్లోరింగ్ తదితర పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. వీటీడీఏ పనుల్లో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో దాదాపు ఎకరం విస్తీర్ణంలో రూ. 2 కోట్లతో మున్సిపల్ పార్క్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు. వేములవాడ నియోజక వర్గంలోని తిప్పాపూర్, మారుపాకలో మోడల్ లే అవుట్ పనులు తుదిదశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. బద్ధిపోచమ్మ ఆలయ నిర్మాణ పనుల పై సమీక్ష నిర్వహించి, ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. శివార్చన స్టేజ్ పనుల పై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, టూరిజం శాఖ డీఈ విద్యాసాగర్, జేఈ జీవన్, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, వీటీడీఏ సెక్రటరీ అన్సారీ, ఎస్టేట్ ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.