శత జయంతోత్సవాలను జయప్రదం చేయండి
భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని, రామగుండంలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.
దిశ, గోదావరిఖని : భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని, రామగుండంలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖని భాస్కర భవన్లో జరిగిన జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కమ్యూనిజాన్ని ఆదరిస్తున్నారని, అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి రావడమే తార్కానమని అన్నారు. డిసెంబర్ 26న సీపీఐ 100 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా వాడవాడనా, గ్రామ గ్రామాన వంద వసంతాల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. 100 సంవత్సరాల చరిత్రలో కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు చేసిందని, రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు యువకులు, మహిళలకు సంబంధించిన అనేక హక్కులు సాధించడంలో కమ్యూనిస్టు పార్టీ పోరాటం ఎనలేనిదని కొనియాడారు.
భారత దేశంలో ప్రజలకు పన్నుల భారాన్ని మోపుతూ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. రాబోయే కాలం అంతా ఎన్నికల కాలమని స్థానిక సంస్థలతో పాటు పంచాయతీ మండల ఎన్నికలలో విజయాలు సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి కౌన్సిల్లో అడుగు పెట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సహాయ కార్యదర్శి గోశిక మోహన్, మాజీ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కె.స్వామి, ఆర్.జీ.1 కార్యదర్శి ఆరెల్లి పోషం, నగర సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య, మడికొండ ఒదెమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య , ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం, నాయకులు కన్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఎజ్జ రాజయ్య, వై.లేనిన్, మొండి డప్పు రాజు, ఆసాల రమ, విప్లవ గేయాలు ఆలపించి అలరింపజేశారు.