ఇతనాల్ బాధితులకు అండగా బీఎస్పీ..
ప్రజలకు హాని కలిగించే కాలుష్య కారకాలను వెదజల్లే ఇతనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బాధితులకు బీఎస్పీ అండగా ఉంటుందని ధర్మపురి బీఎస్పీ ఇంచార్జి నక్క విజయ్ కుమార్ అన్నారు.
దిశ, వెల్గటూర్ : ప్రజలకు హాని కలిగించే కాలుష్య కారకాలను వెదజల్లే ఇతనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బాధితులకు బీఎస్పీ అండగా ఉంటుందని ధర్మపురి బీఎస్పీ ఇంచార్జి నక్క విజయ్ కుమార్ అన్నారు. వెల్గటూర్ మండలంలోని పాసిగామ శివారులో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇతనాల్ పరిశ్రమ ప్రదేశాన్ని ఆదివారం బీఎస్పీ ధర్మపురి ఇంచార్జి నక్క విజయకుమార్ సందర్శించి బాదితులతో మాట్లాడి మీ పోరాటానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇతనాల్ బాధితులతో కలిసి ప్రభుత్వ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పోరాటానికి బీఎస్పీ కార్యకర్తలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు.
ఇతనాల్ పరిశ్రమ వ్యతిరేక పోరాటాన్ని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ఉదృతం చేస్తామనీ హెచ్చరించారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడను మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రభుత్వ పాలకుల తీరు ప్రజాబీష్టం మేరకే ఉండాలని డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమ వల్ల తమకు నష్టం జరుగుతుందని వేలాదిమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేసేది ప్రభుత్వానికి కనిపించడం లేదా కళ్ళుండి గుడ్డిగా వ్యవహరిస్తుందా అని ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తుల స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను బలితీసుకొనే పరిశ్రమను జనావాసాల మధ్య నిర్మించాలని చూడడం సరైనదికాదని విమర్శించారు.
బీఎస్పీ అనేది ఆషామాషీ పార్టీ కాదు. దేశంలోనే మూడో స్థానంలో ఓట్ల సంఖ్యను కలిగి ఉన్న పార్టీఅని గమనించాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతనే ఇతనాల్ పరిశ్రమ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజలతో కలిసి ఇతనాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తామని బాధితులకు ధర్మపురి బీఎస్పీ నియోజకవర్గ ఇంచారజి నక్క విజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. బీఎస్పీ మండల అధ్యక్షులు బచ్చల స్వామి, పలువురు నాయకులు ఉన్నారు.