రాంనూరులో యువకుడి దారుణ హత్య
వెల్గటూర్ మండలం రాంనూరులో మూడు రోజుల క్రితం జరిగిన దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, వెల్గటూర్: వెల్గటూర్ మండలం రాంనూరులో మూడు రోజుల క్రితం జరిగిన దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిదండ్రులే దగ్గర బంధువుల సాయంతో చితకబాదగా అతడు మూడు రోజుల పాటు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు, బంధుమిత్రులు తెలిపిన కథనం ప్రకారం వెల్గటూరు మండలం రాంనూరు గ్రామానికి చెందిన కొదురుపాక భూమయ్య, రాజమ్మ దంపతుల కుమారుడే కొదురుపాక మహేష్ (35), ఓ కూతురు ఉంది. భూమయ్యకు సింగరేణి జాబ్ చేసిన రిటైర్ అయ్యాడు.
అనంతరం స్వగ్రామం రాంనూరులోనే స్థిరపడ్డాడు. అతనికి సుమారు 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి కూడా ఉంది. జాబ్ చేస్తుండగానే కొడుకు, కూతురు వివాహాలు జరిపించేశాడు. కొడుకు మహేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా తల్లిదండ్రులతో పాటు భార్యతో మహేష్ తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలోనే తన మహేష్, కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక భార్య తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మహేష్ మరింత తిరుగుబోతుగా మారి తాగుడుకు బానిసయ్యాడు. ఈనెల 20న రూ.200 కావాలని మహేష్ తండ్రి భూమయ్యను అడిగాడు.
డబ్బు ఇచ్చేందుకు తండ్రి నిరాకరించాడు. అదే సమయంలో శేఖర్ అనే కౌలుదారు వచ్చి తన తండ్రి వద్ద డబ్బులు అడగ్గా వెంటనే అతనికి రూ.5వేలు ఇచ్చాడు. ఈ పరిణామం ఇద్దరి మధ్య వాగ్వాదానికి కారణమైంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేష్ తండ్రితో గొడవపడ్డాడు. అంతే కాకుండా చాలాసార్లు ఆస్తి పంపకాలు చేయాలంటూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర కోపద్రిక్తుడైన మహేష్ తల్లిదండ్రులు భూమయ్య, రాజమ్మ, కూతురు మంగ సహనం కోల్పోయి కౌలుదారు శేఖర్ సహకారంతో మహేష్ ను చితకబాదారు. వారి దెబ్బలకు కాళ్లు, చేతులు విరగ్గా తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు.
గొడవ జరిగిన అనంతరం కుటుంబ సభ్యులు యాక్సిడెంట్ అయ్యిందని నమ్మించి అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించి అతడిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో డాక్టర్లు హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. దీంతో మహష్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ మూడు రోజులు చికిత్స పొందుతూ మహేష్ శుక్రవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకొని ధర్మపురి సీఐ కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఎస్సై నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.