Bhatti Vikramarka : గురుకులాలను మరింత అభివృద్ధి చేస్తాం
విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం తో పాటు వారి రక్షణకు
దిశ,మెట్ పల్లి: విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం తో పాటు వారి రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పెద్దాపూర్ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సందర్శించారు. ఇటీవల పాముకాటుతో మరణించిన విద్యార్థి పేరెంట్స్ తో పాటు అస్వస్థతకు మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులను భట్టి విక్రమార్క పరామర్శించారు. బాధిత కుటుంబాలకు వారి రెసిడెన్స్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇతర విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాలలో ఉన్న వసతులు ఇతరత్రా మౌలిక సదుపాయాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇకపై ప్రతి గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో యాంటీ స్నేక్ వెనం, యాంటీ రేబిస్ టీకాలతో పాటు పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.
ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతి పాఠశాలను స్వచ్ఛంగా ఉంచడంతోపాటు పాఠశాల ఆవరణలో పండ్ల మొక్కల పెంపకానికి చర్యలు చేపడతామన్నారు. ప్రతి ఎమ్మెల్యే తో పాటు కలెక్టర్ ప్రతి వారి పరిధిలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకు ఒక్కసారైనా భోజనం చేయాలని సూచించారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి అత్యంత బాధాకరమని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగరావు,జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో పాటు ఇతర అధికారులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.