CM సభకు సర్వం సిద్ధం.. ఒకే రోజు జగిత్యాలకు KCR, బండి ఎంట్రీతో సర్వత్రా ఉత్కంఠ!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
దిశ, జగిత్యాల ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో సీఎం పర్యటన ఖరారైనప్పటికి పలుమార్లు అనివార్య కారణాలతో వాయిదా పడగా.. ఎట్టకేలకు 7వ తేదీన జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. సీఎం రానుండటంతో జగిత్యాల పట్టణం సుందరంగా ముస్తాబైంది. జిల్లా యంత్రాంగం సీఎం పర్యటనకు సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో 20 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనంతో పాటు టీఆర్ఎస్ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించానున్నారు. అనంతరం ఇటీవలే ప్రారంభించిన వైద్య కళాశాలను సందర్శించిన తర్వాత మోతె రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.
రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ..
సీఎం పర్యటన నేపథ్యంలో జగిత్యాల పట్టణం గులాబీమయంగా మారింది. మోతె రోడ్డులో గల మైదానంలో 2లక్షల మందితో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు సభా ప్రాంగణంలో భద్రతాపరమైన అంశాలతో పాటు వేదికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సభను ఎలాగైనా సక్సెస్ చేయాలని మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించి క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలతో పాటుగా కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, హుజురాబాద్ నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ చేసేందుకు ఆయా ప్రాంతాల ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్ప చెప్పినట్లు సమాచారం.
ముగ్గురు మంత్రులకు సభా బాధ్యతలు..
సభను సక్సెస్ ఫుల్‌గా నిర్వహించేందుకు సభా బాధ్యతలను మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లకు అప్పగించిన్నట్లు సమాచారం. కొప్పుల ఈశ్వర్ ఇంచార్జ్‌గా వ్యవహరించనుండగా మంత్రులు హరీష్, కమలాకర్ ఇతరత్రా బాధ్యతలను చూడనున్నారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా స్థలంలో ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సరైన పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని మంత్రులు సంబంధిత అధికారులకు సూచించారు. ఇక ఇప్పటికే సభ స్థలాన్ని రెండుసార్లు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ రమణ, కౌశిక్ రెడ్డి ఇతర నాయకులు పరిశీలించారు.
ముందస్తు అరెస్ట్‌లు..
సీఎం జిల్లా పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జగిత్యాలలో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు క్షతగాత్రులైన వారు సభకు ఆటంకం కలిగించే అవకాశం ఉండటం సీఎం పర్యటన ఉన్న రోజే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జిల్లాలోకి ఎంటర్ అవుతుందటంతో బీజేపీ నాయకులు సీఎం జిల్లా పర్యటన అడ్డుకునే అవకాశం ఉందన్న ఇంటలిజెన్స్ నివేదికతో అలర్ట్ అయిన జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు సమాచారం. మంగళవారం నుండి బీజేపీ నాయకులతో పాటు కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ముందస్తు అరెస్టు చేసే అవకాశం ఉండగా పోలీసులు ఇప్పటికే ముందస్తుగా అదుపులోకి తీసుకునే వారి జాబితా సైతం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతుంది.