Area Hospital : పేరుకు వంద పడకల ఆస్పత్రి...డెలివరీకి సౌకర్యాలు కరువు
దాదాపు రెండు వందల గ్రామాలకు అందుబాటులో ఉన్న హుజురాబాద్ వంద పడకల ఏరియా ఆసుపత్రి (Area Hospital) సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతుంది
దిశ, హుజురాబాద్ రూరల్ : దాదాపు రెండు వందల గ్రామాలకు అందుబాటులో ఉన్న హుజురాబాద్ వంద పడకల ఏరియా ఆసుపత్రి (Area Hospital) సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతుంది. ప్రసవం కోసం ఓ గర్భిణి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లగా సౌకర్యాలు లేవని హనుమకొండ మిషన్ ఆసుపత్రికి పంపించారు. హుజురాబాద్ పట్టణంలోని 13వ వార్డుకు చెందిన దుబాసి వెన్నెల (Dubasi Vennela)పురిటి నొప్పులతో అపస్మారక స్థితిలో డెలివరీ కోసం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి శనివారం సాయంత్రం వచ్చింది. ఈమె క్రిటికల్ కేసుగా ఉందని, బిడ్డ ఎదుగుదల లేదని, సరైన సదుపాయాలు లేవని, వైద్యులు అందుబాటులో లేరని అక్కడి సిబ్బంది తెలిపారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి కూడా గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు.
దాంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత (Puspalata Vemula)సహకారంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హన్మకొండలోని మిషన్ ఆస్పత్రికి వెళ్లారు. వెన్నెలకు సర్జరీ అవసరమని అక్కడి వైద్యులు తెలిపారు. అలాగే రక్తం కూడా అవసరం ఉంటుందని తొందరగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో సామాజిక సేవకులు జెన్ ప్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ ని సంప్రదించారు. ఆయన తక్షణమే స్పందించి మిషన్ ఆస్పత్రి సూపరింటెండెంట్, సిబ్బందితో మాట్లాడి రక్తంతో పాటు ఏర్పాట్లను తన అనుచరుల ద్వారా చేయించారు.
దాంతో సర్జరీ సజావుగా జరిగి వెన్నెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏరియా ఆస్పతి సిబ్బంది బిడ్డ ఎదగలేదని చెప్పడంతో వారి అవగాహనా రాహిత్యానికి వెన్నెల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా స్వార్థ రాజకీయాలు మానుకోవాలని జెన్ ప్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ అన్నారు. వంద పడకల ఆసుపత్రిలో డాక్టర్లను, గుండె వైద్య నిపుణుడిని నియమించాలని కోరారు. అన్ని పార్టీల నేతలు పేద ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని సూచించారు.