Rajanna temple : ముగ్గురు కొడుకులున్నా అవ్వకు ఆసరగాలే..
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ( Rajanna temple ) సోమవారం కనిపించిన ఓ చిత్రం భక్తులతో పాటు ఆలయ అధికారులను, సిబ్బందిని కలిచివేసింది.
దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ( Rajanna temple ) సోమవారం కనిపించిన ఓ చిత్రం భక్తులతో పాటు ఆలయ అధికారులను, సిబ్బందిని కలిచివేసింది. ఇద్దరు పండు వృద్దులు ( old couple ) వ్యయ ప్రయాసలకు ఓర్చి వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చి వారి ఇంటి ఇలవేల్పైన రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఇందులో ఏముంది ఇదంతా మామూలే కదా అనుకుంటున్నారా...? అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం రాగులపల్లి గ్రామానికి చెందిన రావుల కొమురయ్య - లక్ష్మి అనే వృద్ధ దంపతులు శరీరం వంగిపోయిన స్థితిలో, నడవడానికి సైతం తీవ్ర ఇబ్బంది పడుతూ సోమవారం రాజన్న దర్శనానికి వచ్చారు.
వీరిని చూసిన రాజన్న భక్తులు, ఆలయ అధికారులు, సిబ్బంది అయ్యో అవ్వకు ఎంత కష్టం వచ్చిందని అనుకున్నారు. ఎంతో కష్టపడుతూ వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చి రాజన్నను దర్శించుకోవడం, రాజన్న పట్ల నిజంగా వారికున్న భక్తి భావాన్ని తెలియజేస్తుందని వారి పై ప్రశంసలు కురిపించసాగారు. అయితే సరిగ్గా ఇదే దృశ్యం దిశ కంటపడి అసలు విషయం ఏంటని ఆరా తీయగా భక్తి వెనక దాగి ఉన్న అసలు బాధను ఆ వృద్ధ దంపతులు బయటపెట్టారు.
ఆసరా కానీ ముగ్గురు కొడుకులు..
దిశ ప్రతినిధి ఇలా పలకరించగానే వృద్ధ దంపతులు వారి కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ బాధను వ్యక్తం చేశారు. తమకు ముగ్గురు కొడుకులు ఉన్నారని, వారికి సైతం కొడుకులు, బిడ్డలు ఉన్నారని, తమది ఎంతో పెద్ద కుటుంబమని అన్నారు. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న భూ వివాదాల వల్ల తమ కొడుకులు, మనవల్లు, మనవరాళ్లు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది వలే ఈ సోమవారం రోజున ఎలాగైనా రాజన్నను దర్శించుకోవాలని అనుకోని, కుటుంబ సభ్యుల సహకారం లేకపోయినా రాజన్న పై భక్తిని చంపుకోలేక ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి స్వామివారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులు తమను పట్టించుకోకపోయినా సమీప బంధువు సాయంతో ఆటోలో ఇక్కడి వరకు వచ్చామన్నారు.
ఇక్కడికి వచ్చాక ఆలయ సిబ్బంది తమ పరిస్థితిని చూసి త్వరగా స్వామి వారి దర్శనం చేయించారన్నారు. వారి సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకున్నట్లు వారు స్పష్టం చేశారు. కనీసం ఇప్పటికైనా తమ భూవివాదాలు తొలగిపోవాలని, దూరమైన కుటుంబ సభ్యులు మళ్ళీ తమ దరికి చేరాలని, జీవితం చివరి రోజుల్లోనైనా తమ కన్న కొడుకులు తమకు ఆసరాగా నిలవాలని ఆ రాజన్నను వేడుకున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా ముగ్గురు కొడుకులున్న ముసలి అవ్వకు, ఆసరాగా రాలేదనే విషయం తెలుసుకున్న భక్తులు, ఆలయ అధికారులు, సిబ్బంది అయ్యో పాపం అవ్వకు ఎంత కష్టం వచ్చిందని విచారం వ్యక్తం చేశారు.