బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ..
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండల బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
దిశ, గన్నేరువరం : కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండల బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మండలానికి చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీ మాజీ ప్రజా ప్రతినిధులు వారి అనుచరగనంతో సుమారు 100 మంది డీసీసీ అధ్యక్షుడు కావంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాదులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గన్నేరువరం ఎంపీటీసీ బొడ్డు పుష్పలత, మైలారం సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం, సాంబయ్య పల్లి సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి, చొక్కా రావు పల్లి సర్పంచ్ ముసుకు కరుణాకర్ రెడ్డి, కాసింపేట ఉపసర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, మాజీ ఎంపీపీ కటకం తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ వరాల మల్లేశం, అంబేద్కర్ సంఘం నాయకులు నేత కిషన్ లతో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.