తెలంగాణలో పోటీకి జనసేన దూరం?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా పోటీ చేద్దామనుకుంటున్న పలు పార్టీలు చివరి నిమిషంలో మనసు మార్చుకుంటున్నాయి.

Update: 2023-11-04 18:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా పోటీ చేద్దామనుకుంటున్న పలు పార్టీలు చివరి నిమిషంలో మనసు మార్చుకుంటున్నాయి. పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నాయి. తాజాగా జనసేన సైతం పోటీ నుంచి తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు తెలిపిన ఫార్ములా తరహాలోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వ్యవహరించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. కిషన్‌రెడ్డి, పవన్ కల్యాణ్ మధ్య శనివారం రాత్రి సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేయనున్నదనే విషయంపై స్పష్టత రాలేదు. సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా కొలిక్కి రాలేదు. దీంతో చివరి నిమిషం వరకు జనసేన పోటీలో ఉంటుందా?.. లేక తప్పుకుంటుందా?.. అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతున్నది.

ఇదిలా ఉండగా కిషన్‌రెడ్డితో జరిగిన భేటీ అనంతరం పవన్ కల్యాణ్ పేరుతో జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. తొలుత తాము తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బీజేపీతో చర్చించామని, ఇంకా ఆ చర్చలు కొనసాగుతున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. బీజేపీతో కలిసి పోటీ చేయాలని భావించినా రెండు సీట్ల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని తెలిపింది. పోటీ చేసే స్థానాలపై చర్చలు తుది దశకు వచ్చినా ఆ రెండింటిపై స్పష్టత రావాల్సి ఉన్నదని వివరించింది. మరోసారి జరిగే సమావేశంలో కొలిక్కి వస్తాయని, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారని తెలిపింది.

మరోవైపు బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం చేయాలనే వాదనలూ వినిపిస్తున్నాయి. తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. హడావిడిగా నిర్ణయం తీసుకోడానికి బదులు ప్రస్తుతానికి పోటీ చేయకుండా ఉత్తమమని కొద్దిమంది ప్రతిపాదించినట్లు తెలిసింది. పోటీతో సంబంధం లేకుండా బీజేపీతో స్నేహపూర్వక సంబంధాలను యధాతథంగా కొనసాగించాలనే జనసేన భావిస్తున్నది. ఈ నెల 7న ప్రధాని మోడీ పాల్గొనే హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందని, అందులో పవన్ కల్యాణ్ పాల్గొంటారని ఆ ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, వైఎస్సార్టీపీ లాంటి పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. జనసేన సైతం అదే బాటలో పయనించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసమితి స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతు పలికింది. తాజాగా షర్మిల సైతం పోటీ చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకుని కాంగ్రెస్‌కు సహకారం ఇవ్వనున్నట్లు తెలిపింది. తెలుగుదేశం మాత్రం ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. జనసేన విషయంలో మాత్రం భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. నిర్ణయం వెలువడడానికి మరింత సమయం పట్టవచ్చని సమాచారం.

జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏయే స్థానాలను కేటాయించాలనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 స్థానాలు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తే మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల పేర్లను తుది జాబితాలో ప్రకటించనున్నది. 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించినా చివరకు బీజేపీ వైపు నుంచి 11 స్థానాలకు తగ్గిపోయినట్లు జనసేన వర్గాల సమాచారం. శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ విషయంలో బీజేపీ నేత నుంచి అభ్యంతరం వ్యక్తమైనట్లు తెలిసింది. పవన్ కల్యాణ్ చర్చల తర్వాత కూడా ఏకాభిప్రాయం రాలేదు. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. జనసేనతో పొత్తును, సహకారాన్ని కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. అరెస్ట్ తర్వాత ఒకటిన్నర నెల రోజులకు పైగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబునాయుడిని గతంలో ములాఖత్ ద్వారా కలిసిన పవన్ కల్యాణ్ తాజాగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండడంతో ఇంటికి వెళ్ళి పరామర్శించారు. సుమారు మూడున్నర గంటల పాటు వీరిద్దరూ సంభాషించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలిసినా రెండు పార్టీల తరఫున అధికారిక ప్రకటన వెలువడలేదు. చంద్రబాబుతో భేటీ తర్వాత కిషన్‌రెడ్డితో సమావేశం జరగడం గమనార్హం.

Tags:    

Similar News