టెట్ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. అప్లికేషన్ ఫీజు తగ్గింపు..!
రాష్టంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. టెట్ పరీక్ష ఫీజును ఏకంగా రెండు వేల రూపాయలకు పెంచడంపై నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సమయం కావడంతో విపక్షాలు తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది.
గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ.300గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు వరకు పెంచింది. ఫీజులను ఈ స్థాయిలో పెంచడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్, శిక్షణ, హాస్టల్ ఫీజులకే వేల రూపాయలు ఖర్చుపెడుతున్న తమకు పెరిగిన పరీక్ష ఫీజలు చెల్లించడం మరింత భారంగా మారిందని, ఇలా చేయడం తగదని.. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
దీంతో ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఫీజుల పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని సీఎంవో వర్గాలు సీఎంకి వెల్లడించినట్లు తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం. దీంతో సమస్య తీవ్రతరం కాకముందే ఫీజు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ముందు వాగ్దానం చేసింది. కానీ, ఇందుకు విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు సమాచారం.
రావుల రామ్మోహన్ రెడ్డి- తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
టెట్ ఫీజు తగ్గించిన తర్వాతే అప్లికేషన్స్ స్వీకరించాలి. షెడ్యూల్ ప్రకారం మార్చి 27 బుధవారం నుండి టెట్‌కి అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుందని విద్యాశాఖ పేర్కొన్నారు. కాబట్టి పెంచిన టెట్ ఫీజు రద్దు చేసి గతంలో మాదిరిగా 200 ఫీజు నిర్ణయించాలి. ఆ తర్వాతే అప్లికేషన్స్ స్వీకరణ చేయాలి. పరీక్షలు ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించాలి. ఆన్ లైన్ (కంప్యూటర్ విధానం తొలగించాలి)మేనిఫెస్టోలో ఫ్రీ ఫీజు అని, ఇప్పుడు 2 వేలు ఫీజు వసూల్ చేయడం దారుణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పరీక్షల ఫీజులు ఉండవు అని చెప్పి.. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా టెట్‌కి ఒక్కో పేపర్‌కి వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాలి అనడం 4 లక్షల మంది అభ్యర్థులను మోసం చేయడమే అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో నుండి గత సంవత్సరం టెట్ వరకు టెట్ ఫీజు రూ.200 నుండి రూ.300 వరకు ఉండగా ఇప్పుడు ఆన్ లైన్ పరీక్ష పేరిట వెయ్యి రూపాయలు చేయటం సరికాదు. వెంటనే టెట్ ఫీజు తగ్గించాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము.