హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటీ వెనుక అసలు కారణం ఇదేనా?

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణపై కన్నేసిన బీజేపీ పెద్దలు టాలీవుడ్ ప్రముఖులతో వరుసగా భేటీ కావడం హాట్ టాపిక్ గా మారుతోంది.

Update: 2022-08-27 07:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణపై కన్నేసిన బీజేపీ పెద్దలు టాలీవుడ్ ప్రముఖులతో వరుసగా భేటీ కావడం హాట్ టాపిక్ గా మారుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ తో సమావేశం అయిన ముచ్చట మరువకముందే తాజాగా తెలంగాణకు చెందిన ఏకైక పాపులర్ హీరో నితిన్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం భేటీ కానుండటంతో వీరి భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు ఇవాళ జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఈ టూర్ లో భాగంగా ఆయన హీరో నితిన్, ప్రముఖ స్పోర్ట్స్ ఉమెన్ మిథాలి రాజ్ తో పాటు పలువురు కవులు, ఉద్యమకారులతో పాటు పారిశ్రామిక వేత్తలతోనూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయే ప్రచారం జరుగుతోంది.

జూ.ఎన్టీఆర్ సరే.. నితిన్ తో భేటీ సంగతేంటి?

ప్రస్తుతం వరుసగా సినీ నటులతో బీజేపీ అగ్రనేతలు సమావేశం అవుతుండటం వెనుక బీజేపీ ప్లాన్ ఏంటి అనే చర్చ ఆసక్తిగా మారింది. మునుగోడు సభ అనంతరం అమిత్ షా, జూ.ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక ప్రధానమైన ఎజెండా ఏంటో స్పష్టంగా తెలియకపోయినా.. రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రాజకీయంగా ఆలోచన చేస్తే జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ వెనుక టీడీపీ సానుభూతి ఓట్ల కోసమే అని, రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి కావడమే అని చర్చలు తెరపైకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనను చూసి ఎన్టీఆర్ ను ప్రశంసించేందుకే అమిత్ షా భేటీ జరిగిందని కొంతమంది బీజేపీ నేతలు చెప్పగా.. మరి కొంతమంది మాత్రం వీరి మధ్య రాజకీయ చర్చ జరిగితే జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఆల్ ఆఫ్ సడెన్ గా హీరో నితిన్ ను బీజేపీ టచ్ లోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. రాబోయే ఎన్నికల నాటికి బీజేపీకి సపోర్ట్ గా పెద్ద ఎత్తున సినీ గ్లామర్ ను పెంచాలనే వ్యూహత్మకంగా పావులు కదుపుతోందని చర్చ మొదలైంది. అందులో భాగంగానే నితిన్ తో భేటీ జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ కు షాకిచ్చేలా బీజేపీ స్కెచ్?

బీజేపీ నేతలు టాలీవుడ్ స్టార్లతో వరుసగా భేటీ అవ్వడం వెనుక సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చే ప్రణాళిక ఉందనే ప్రచారం తెరపైకి వస్తోంది. సీఎం కేసీఆర్ తో సినీ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు తో కేసీఆర్ కు ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. ఇటీవల తమిళ స్టార్ దళపతి విజయ్ ఏకంగా ప్రగతి భవన్ లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. వీరంతా రాజకీయ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ తో టచ్ లోకి వస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సీన్ కట్ చేస్తే.. టాలీవుడ్ స్టార్లను బీజేపీ లైన్ లోకి తీసుకోవడం సర్వత్రా హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటికి మొన్న జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అవ్వగా.. తాజాగా తెలంగాణకు చెందిన హీరో నితిన్ తో జేపీ నడ్డా సమావేశం కానుండటం చర్చనీయాంశంగా మారింది. హీరో నితిన్ కు సీఎం కేసీఆర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో కరోనా టైమ్ లో హీరో నితిన్ ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ కు విరాళం అందజేశారు. అనంతరం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కోటి మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అలాగే తన మ్యారేజ్ కు రావాల్సిందిగా స్వయంగా వెళ్లి ఆహ్వానం అందించారు. కేసీఆర్ తో సంబంధాలు కలిగిన నితిన్.. ఇప్పుడు బీజేపీ అగ్రనేతతో భేటీ కాబోతుండటం ఆసక్తిగా మారింది.

ఆపరేషన్ నార్త్ తెలంగాణలో భాగమా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర హీరోల ఆధిపత్యాన్ని తట్టుకుని తెలంగాణకు చెందిన నితిన్ హీరోగా నిలదొక్కుగోలిగాడు. తెలంగాణ నుంచి సినీ పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు, నటులు ఉన్నప్పటికీ.. బీజేపీ మాత్రం నితిన్ పై ఫోకస్ పెట్టింది. ఈ పరిణామం వెనుక బీజేపీ ఆపరేషన్ నార్త్ తెలంగాణ ప్రధాన ఎజెండా ఏదైనా ఉండి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నితిన్ తెలంగాణలోని నిమాజామాబాద్ జిల్లాకు చెందిన వాడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో సినీ డిస్ట్రిబ్యూటర్ కూడా. తెలంగాణ వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి. ఇక తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినంటూ అనేక సందర్భాల్లో నితిన్ బహిరంగంగానే ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయంగా నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలహీన పడుతోందనే అంచనాలతో బీజేపీ ఉంది. ఇక నిజామాబాద్ లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను గతంలో బీజేపీ ఓడించింది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ తప్పదనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఇదే జిల్లాకు చెందిన నితిన్ తో బీజేపీ సంబంధాలు కలుపుకోవాలనే ప్రయత్నం రాజకీయంగా అనేక ఊహాగానాలకు తావిస్తోంది.

సినీ గ్లామర్ పై స్పెషల్ నజర్

టీఆర్ఎస్ ను గద్దెదించి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అన్ని రంగాల వారిని కలుపుకుపోయే పనిలో పడింది. ఓ వైపు తెలంగాణ ఉద్యమకారులతో సమావేశాలు అవుతూనే.. మేధావి వర్గాలతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ నటీనటులతో మరింత చేరువ కావాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఫైర్ బ్రాండ్ గా పేరు ఉన్న విజయశాంతి ఇప్పటికే పార్టీలో కొనసాగుతుండగా.. జీవిత రాజశేఖర్ లాంటి వాళ్లు యాక్టివ్ అయిపోయారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు పంపించింది. జూ.ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరిపి ఓ అంచానాకు వచ్చింది. వీరితో పాటు మరి కొంత మంది నటీనటులు బీజేపీకి అనుకూలంగా ఉన్నవారు ఉన్నారు. ఈ క్రమంలో అధికారమే లక్ష్యంగా సాగుతున్న బీజేపీకి సినీ గ్లామర్ ఏ మేరకు కలిసి వస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

ఇవి కూడా చదవండి : నడ్డాతో మిథాలీ రాజ్ భేటీ 

Tags:    

Similar News