పొత్తులపై BRS స్కెచ్ అదేనా!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేసి విజయం సాధించింది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేసి విజయం సాధించింది. అయితే ఈ దఫా మాత్రం పొత్తులపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఒంటరిగా వెళ్తే ప్రభుత్వ వ్యతిరేకత ముప్పును పసిగట్టిన సీఎం కేసీఆర్ కలిసొచ్చే పార్టీలతో పొత్తుకు సై అంటున్నారు. అటూ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత వస్తున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో కేసీఆర్ వీటిని సవాల్‌గా తీసుకున్నారు. ఈ దఫా సత్తా చాటని పక్షంలో దేశవ్యాప్తంగా తన ప్రతిష్ట మసకబారనుండటంతో అప్రమత్తమైన కేసీఆర్ ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటలని ఇప్పటికే ఆయా చోట్ల ప్రత్యేక సర్వే చేయించారని సమాచారం.
సిట్టింగ్‌లకే సీటు అని చెబుతున్న చివరి నిమిషంలో కొంత మందిని మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పుడే ప్రకటన చేస్తే కొంత మంది వేరే పార్టీలతో టచ్‌లోకి వెళ్తారని గ్రహించిన గులాబీ బాస్ ఈ విషయమై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ద్వారా రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వామపక్షాలను మచ్చిక చేసుకునేందుకు ప్లాన్ చేసిన కేసీఆర్ వారికి ఆ సభకు ఆహ్వానాన్ని పంపారు. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు, సీపీఐ ప్రదాన కార్యదర్శి డి.రాజాను కూడా బహిరంగ సభకు కేసీఆర్ ఆహ్వానించారు. అయితే బీఆర్ఎస్‌తో పొత్తుల అంశమై నేడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భేటీ కానున్నాయి. జాతీయ స్థాయిలో మద్దతుతో పాటు రాష్ట్రంలో పొత్తు విషయమై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
ఎంఐఎంతో సాఫ్ట్‌గా..
సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఎంఐఎం పార్టీతో సాఫ్ట్‌గానే ఉంటున్నారు. ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై బహిరంగంగా కామెంట్ చేసిన విమర్శించినా కేసీఆర్ అండ్ కో పెద్దగా రియాక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ముస్లిం ఓటు బ్యాంకును ప్రభావితం చేసే ఎంఐఎం హైదరాబాద్, ఓల్డ్ సిటీ మినహా పోటీకి అభ్యర్థులను దించడం లేదు. ఆయా జిల్లాల్లో ఆ పార్టీకి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉన్నారు. వారంతా బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా పని చేస్తున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కూడా బీఆర్ఎస్, కేసీఆర్ వైపే ఉన్నారు. ఆ పార్టీకే ఓటు వేయాలని గత రెండు ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో లేని చోట ప్రచారం నిర్వహించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం పార్టీతో కేసీఆర్ సఖ్యతగా మెలగడానికి ముస్లిం ఓటు బ్యాంకు కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో ఆ వర్గంలో కొంత అసంతృప్తి నెలకొంది. దాన్ని ఎలా అధిగమిస్తారనేది కేసీఆర్ ముందున్న సవాల్.
కాంగ్రెస్‌తో అయినా ఓకే..
బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్న సీఎం కేసీఆర్ ఆ పార్టీని తెలంగాణలో ఎలాగైనా నిలువరించడంలో భాగంగా వచ్చే ఎన్నికల్లో అవసరమైతే కాంగ్రెస్‌తో కలవడానికి వెనకాడకపోవచ్చని టాక్. కేసీఆర్‌కు సోనియాతో ఆది నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలన్నా జాతీయ స్థాయిలో సత్తా చాటలన్నా కాంగ్రెస్ పార్టీతో కలిసి కేసీఆర్ భవిష్యత్తులో నడవాల్సి ఉంటుంది. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ లేని కూటమి పని చేయదని ఇప్పటికే పొలిటికల్ అనలిస్ట్‌లు పలుమార్లు వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్షాలు, ఎంఐఎం, కాంగ్రెస్‌లతో పొత్తు పెట్టుకొనైనా గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ఈ మూడు పార్టీలతో పొత్తు పెట్టుకొని అయినా అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు దేశవ్యాప్తంగా ఆయా పార్టీలను తమ వైపునకు తిప్పుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరి కేసీఆర్ తాననుకున్న లక్ష్యాలను చేరుకుంటారా లేదా అనేది అసెంబ్లీ ఎన్నికల నాటికి స్పష్టత రానుంది.
Also Read...
ఖమ్మంలో 'గులాబీ'కి పట్టు శూన్యం.. అధిష్టానానికి తప్పని తలనొప్పులు