ఎయిమ్స్, ఈఎస్ ఐలకు సెక్యూరిటీ పెంపు : కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎయిమ్స్‌, ఈఎస్‌ఐ ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లో భద్రతను పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్ణయించింది.

Update: 2024-08-20 15:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎయిమ్స్‌, ఈఎస్‌ఐ ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లో భద్రతను పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం మార్గదర్శకాలు జారీచేసింది. కొల్ కతా ఘటన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని కేంద్రం వివరించింది. ప్రస్తుతం ప్రైవేట్‌ ఆసుపత్రులతో పోలిస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైనా సులువుగా రాకపోకలు సాగించగానికి అనువుగా ఉన్నాయని వెల్లడించారు. దీనివలనే కొన్నిసార్లు వైద్య సిబ్బందిపై దాడుల వంటి ఘటనలు జరుగుతున్నాయని కేంద్రం వివరించింది. ఆసుపత్రి ప్రాంగణంలో వైద్య సిబ్బందిపై హింసను నిరోధించడానికి రాష్ట్ర చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని కేంద్రం నొక్కి చెప్పింది. ఆసుపత్రుల ఎంట్రన్స్, ఎగ్జిట్ తో పాటు అన్ని ప్రాంతాల్లో తగినంత సంఖ్యలో హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు అమర్చాలని కేంద్రం సూచించింది. అత్యవసర పరిస్థితికి తగినట్లుగా స్పందించేందుకు కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసి భద్రతా సిబ్బందితో పాటు ఒక అడ్మిన్, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది. సిబ్బంది, పేషెంట్ అడెంటర్లు, ఆసుపత్రి ప్రాంగణాలను ఎప్పటికప్పుడు చెక్ చేసేలా వ్యవస్థను సమకూర్చుకోవాలని కేంద్రం సూచించింది.


Similar News