25న తమిళనాడుకు బీఆర్ఎస్ బీసీ నేతలు

బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యాయనం చేసేందుకు గులాబీ నేతల బృందం సిద్ధమైంది.

Update: 2024-09-22 21:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యాయనం చేసేందుకు గులాబీ నేతల బృందం సిద్ధమైంది. తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేయనుంది. తొలుత కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆ రాష్ట్రాల్లో బీసీల కోసం చేపడుతున్న పథకాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయడంతో పాటు అవి అమలు చేసేందుకు సైతం ఒత్తిడి చేయనున్నారు.

రాష్ట్రంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. సమగ్ర కులగణన, 42శాతం రిజర్వేషన్ల కల్పన, బీసీ సబ్ ప్లాన్ కు హామీ ఇచ్చింది. వాటి అమలుపై బీఆర్ఎస్ పోరాటానికి సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అయిన తమిళనాడు, కేరళలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల విధానం అధ్యయనం చేయడానికి బీసీ నాయకుల బృందాన్ని పంపనుంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో బీసీ నేతల బృందం తమిళనాడులో తొలుత పర్యటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో 15 మంది సభ్యులు ఈ బృందంలో ఉండనున్నారు. తమిళనాడు ప్రభుత్వం బీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు, కేటాయిస్తున్న బడ్జెట్, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కల్పిస్తున్న రాజకీయాలు, ప్రోత్సహిస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి తెలంగాణ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి అందజేయనున్నట్లు సమాచారం.

బీహార్, పంజాబ్, యూపీలో సైతం..

తమిళనాడు పర్యటన తర్వాత కేరళలో బీసీ నేతలు పర్యటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ తర్వాత బీహార్, పంజాబ్, యూపీలో సైతం నేతలు వెళ్లి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల అనుసరిస్తున్న విధానం, అవకాశాలు, రిజర్వేషన్లపై క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు. ‘బీసీ’ అంశంతో బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాటం చేయాలని భావిస్తుంది. అందుకోసం ఒక వైపు ఆయా రాష్ట్రాల అధ్యయనం మరోవైపు పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తుంది.

ఇప్పటికే ప్రభుత్వానికి డెడ్ లైన్

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లోని హామీలను నవంబర్ 10 వరకు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ డెడ్ లైన్ విధించింది. సమగ్ర కుల గణన వెంటనే చేపట్టాలని, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తుంది. గడువులోగా నెరవేర్చకపోతే పోరాటం చేస్తామని ప్రకటించింది. లేకుంటే బలహీన వర్గాల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. నిలదీస్తాం అని వెల్లడించింది. బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి బడ్జెట్ లో కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి బీసీలను మోసం చేసిందని మండిపడింది. రానున్న బడ్జెట్లో కనీసం 25 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయలు బీసీ లకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. బీసీల కోసం ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ మాటకు కట్టుబడి ఉండాలని, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మంత్రి నియమించాలని డిమాండ్ చేస్తుంది. బీసీ కులాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని వివరించడంతో పాటు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను లెక్కలతో వివరించాలని భావిస్తుంది.


Similar News