నేటి నుంచి బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ యాక్టీవిటీస్

రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య ఆరోగ్య పరిస్థితులపై బీఆర్ఎస్ పార్టీ నిజనిర్ధారణ అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సోమవారం నుంచి కార్యక్రమాలను ప్రారంభించనుంది.

Update: 2024-09-22 20:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య ఆరోగ్య పరిస్థితులపై బీఆర్ఎస్ పార్టీ నిజనిర్ధారణ అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సోమవారం నుంచి కార్యక్రమాలను ప్రారంభించనుంది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు తెలుసుకోనున్నారు. రోగి సహాయకుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. అదే విధంగా నిమ్స్, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం తదితర ప్రభుత్వ ఆసుపత్రులను కూడా సందర్శించనున్నట్లు డాక్టర్ రాజయ్య తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండ్లు, డాక్టర్ల నుంచి కూడా వైద్య సేవల వివరాలు సేకరిస్తామన్నారు. ఆ ఆసుపత్రుల్లోని పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్ లో త్రిసభ్య కమిటీతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. పలు అంశాలు చర్చించారు. రాష్ట్రంలో హెల్త్ పరిస్థితులు దిగజారాయని, వాటిపై అధ్యాయనం కోసమే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి పారదర్శకంగా ఉన్నామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, కమిటీకి సహకరించాలని కోరారు. ప్రజల ఇబ్బందులను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వెల్లడించారు.


Similar News