దామగుండం అడవుల్లో 12 లక్షల చెట్లను తొలగించలేదు : అటవీ సంరక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్

తూర్పు నౌకాదళ రాడార్ స్టేషన్ ను నెలకొల్పేందుకు వికారాబాద్ లోని దామగుండం అడవుల్లో 12 లక్షల చెట్లను తొలిగించనున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి రాకేష్ మోహన్ డోబ్రియాల్ క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-09-22 17:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తూర్పు నౌకాదళ రాడార్ స్టేషన్ ను నెలకొల్పేందుకు వికారాబాద్ లోని దామగుండం అడవుల్లో 12 లక్షల చెట్లను తొలిగించనున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి రాకేష్ మోహన్ డోబ్రియాల్ క్లారిటీ ఇచ్చారు. రాడార్ ప్రాజెక్టు నిర్మాణ కోసం కేటాయించిన అటవీ భూముల్లో 48 శాతం విస్తీర్ణంలో మాత్రమే స్టేషన్ కోసం వినియోగిస్తామని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన 52 శాతం విస్తీర్ణంలోని అటవీ సంపదకు ఎలాంటి హానీ జరగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. 48 శాతం అటవీ భూమిలోనూ కేవలం రాడార్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన కొన్ని చెట్లను మాత్రమే తొలగిస్తామని స్పష్టం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ (భారత ప్రభుత్వం) కు అనుబంధంగా పనిచేసే ఫారెస్ట్ అడ్వైజరీ అథారిటి 1,93,562 చెట్లను మాత్రమే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం తొలిగించడం జరుగుతుందని స్పష్టం చేసిందని వివరించారు. రాడార్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత తొలిగించాలనుకున్న చెట్ల సంఖ్యను ఇంకా తగ్గించే దిశగా అటవీశాఖ ప్రణాళికలు చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో కోల్పోనున్న 1,93,562 చెట్లకు బదులుగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అడవుల్లోని 2,348 హెక్టార్లలో విస్తరించి వున్న 17,55,070 చెట్లను అటవీశాఖ పునరుద్ధరించనున్నదని వివరించారు.


Similar News