ఇందిరమ్మ ఇండ్లకు నో జీఎస్టీ!

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనే సామెత ఒకటి మనం అంతా వినే ఉంటాం. కానీ, గత ప్రభుత్వ హయాంలో ఇండ్లకు సంబంధించిన అంశంలో.. నిధులన్నీ ట్యాక్సుల పాలు అయ్యాయంటే అతిశయోక్తి కాదు.

Update: 2024-09-22 21:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనే సామెత ఒకటి మనం అంతా వినే ఉంటాం. కానీ, గత ప్రభుత్వ హయాంలో ఇండ్లకు సంబంధించిన అంశంలో.. నిధులన్నీ ట్యాక్సుల పాలు అయ్యాయంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ అత్యతంత ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టి అమలు చేసిన పథకంలో నిధులు పెద్ద ఎత్తున జీఎస్టీకే వెళ్ళాయంటే నమ్మకతప్పదు. ఇందిరమ్మ ఇండ్లకు దీటుగా నిర్మించామని చెప్పుకునేందుకు కేసీఆర్ వేసిన ఎత్తగడనే దీనంతటికి కారణమని తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ. 12,500 కోట్లు నిధులు డబుల్ బెడ్ రూం లకు వెచ్చించగా.. అందులో 18 శాతం దాదాపు 2,200 కోట్ల నిధులు జీఎస్టీకే వెల్లడం విస్మయానికి గురి చేస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లేదని తెలిసింది. నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి నిధులు వెళుతుండటంతో ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్సు కట్టాల్సిన అవసరం లేదని సమాచారం. దీంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారం తగ్గనుంది. అయితే, గతంలో కేసీఆర్ సర్కారు నిర్మించిన డబుల్ బెడ్ రూంలకు వెచ్చించిన నిధుల్లో అధిక భాగం జీఎస్టీకే వెళ్ళగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వంపై ఎటువంటి భారం పడే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారం తగ్గనుంది. రైతు రుణ మాఫీ అమలు, రానున్న రోజుల్లో రైతు భరోసా వంటి పథకాలతో ఆర్థికంగా కటకట ఉండటంతో పాటు.. తాజా ఈ విధానంతో సర్కారుకి కొంతమేర ఊరట లభించనుంది. ఈ ఇందిరమ్మ స్కీం కూడా హడ్కో లోను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

‘డబుల్‌‘ తో త్రిబుల్ తలనొప్పి

గతంలోని కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మగౌరవానికి ప్రతీకలుగా చెప్పుకున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం ట్రిపుల్ తలనొప్పి అయింది. రాష్ట్ర పరిధిలో సుమారు 1 లక్షా 50 వేల ఇండ్లు కట్టాలని నిర్ణయించగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం 1 లక్ష ఇండ్లు కట్టాలని బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రణాళికలు రచించింది. వాస్తవానికి 66,789 వేల ఇండ్లు పూర్తి చేసింది. ఇందులో 65 వేల ఇండ్లను లబ్ధిదారులకు అందజేసింది. 18 వేల ఇండ్ల వరకు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. 11 వేల ఇండ్లు మాత్రం పెండింగ్ వర్కుల్లో ఉన్నాయి. వీటిని తెలంగాణ సర్కారు, హడ్కో సంస్థ ఇచ్చిన రూ. 8 వేల కోట్ల అప్పు.... రూ. 4,500 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపులతో నిర్మించింది. మొత్తం రూ. 12,500 కోట్ల దాకా ఇందులో ప్రభుత్వం ఖర్చు చేయగా.. దానికి 18 శాతం జీఎస్టీలంటూ కేంద్రానికి ట్యాక్సులు పోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వమే ఇండ్లు ప్రజలకు కట్టిస్తామన్న ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ భారం పడిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్లకి ఎందుకు లేదు జీఎస్టీ

ఇందిరమ్మ ఇండ్లకు జీఎస్టీ ఎందుకు లేదన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. ఎందుకంటే, ప్రభుత్వం ఈ నిర్మాణం ఎక్కడా బడా, మధ్య తరహా, చిన్న తరహా కాంట్రాక్టర్లకు ఇవ్వడం లేదు. నేరుగా లబ్ధిదారుడిని గుర్తించి.. ఆయనకే ప్రభుత్వం నిర్దేశించిన పద్దతిలో కడితే.. ఇంటి అమౌంట్ వెళ్ళనుంది. ప్రభుత్వ పథకానికి జీఎస్టీ వంటి ట్యాక్సులు ఏమీ కట్ కావు. దానికితోడు, లబ్ధిదారుడు నిర్మించిన వరకు ఎప్పటికప్పడు డబ్బులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంటుందని హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

పీఎంఏవై రూల్స్ లబ్ధిదారుడికే.. నో ట్యాక్స్

ఇందిరమ్మ ఇండ్లలో కేంద్రం ఇచ్చే నిధులు కూడా లబ్ధిదారుడికే వచ్చే అవకాశం ఉన్నది. వాటికి ట్యాక్స్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే, పీఎంఏవై రూల్స్‌ ప్రకారం లబ్ధిదారుల జాబితా ఇంటి నిర్మాణం ప్రారంభం కంటే ముందే కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. జీహెచఎంసీ, రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో జరిపిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం, కేంద్రానికి లబ్ధిదారుల జాబితాను నెమ్మదిగానో... ఆలస్యంగానో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అందజేస్తుంది. 2011లో వెల్లడైన సామాజిక, ఆర్థిక సర్వేలో ఉన్న పేర్లనే ఇవ్వాలని కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఒత్తిడి చేస్తున్నది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులున్నా.. కేంద్ర ప్రభుత్వ నిధులు రావాలంటే, ఈ నిబంధనలు పాటించ తప్పదని చెబుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో బీఆర్ఎస్ సర్కారు అవగాహనాలోపం వల్లనే జరిగిందని ఆ శాఖ అధికారులే వెల్లడిస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం పైసలు తెచ్చుకోవడంలో విఫలం అయ్యాం.. ఇటు పేదలకు ఇండ్లు కట్టడం సఫలం కాకపోవడడం.. నిధులన్నీ ట్యాక్సుల పాలు అవడంకి ప్రధాన కారణంగా గత ప్రభుత్వమే అంటూ.. ప్రస్తుత ప్రభుత్వం బలంగా అభిప్రాయపడుతున్నది.


Similar News