కేటీఆర్ సూచనతో నేను ఏకీభవిస్తున్నా.. డీలిమిటేషన్ పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం తీసుకొస్తానంటున్న డీలిమిటేషన్ అంశం గత కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం తీసుకొస్తానంటున్న డీలిమిటేషన్ (Delimitation) అంశం గత కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టేందుకు పార్టీల మద్దతు కోరుతూ శనివారం తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamilnadu CM Stalin) అఖిల పక్ష సమావేశం (All Party Meeting) కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Former MP Vijayasai Reddy) ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మాజీ ఎంపీ.. కేవలం జనాభాపై ఆధారపడిన డీలిమిటేషన్ మనకు నష్టం కలిగిస్తుందని, దక్షిణ భారత రాష్ట్రాల ఆందోళనలతో అంగీకరిస్తున్నానని అన్నారు. అలాగే ఆందోళనలు న్యాయమే అయినప్పటికీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah).. దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రమూ సీట్లు కోల్పోదని, న్యాయమైన పెంపుదల జరుగుతుందని కూడా భరోసా ఇస్తున్నారని తెలిపారు.
అంతేగాక ఎమ్‌కే స్టాలిన్ (MK stalin) నేతృత్వంలోని జేఏసీ దక్షిణ భారతదేశం కోసం పోరాడేందుకు ముందుకు వచ్చినందుకు ప్రశంసించబడుతోందని చెప్పారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) లో 4.6 శాతం లోక్‌సభ స్థానాలు (Lok Sabha Seats), ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లో 14.7 శాతం లోక్ సభ స్థానాలు ఉన్నాయని, వీటిలో ఏదైనా పెరుగుదల జరిగితే కొత్త లోక్ సభలో కూడా అదే శాతాన్ని కొనసాగించాలని సూచించారు. కోట్లాది మంది భారతీయులు తమ రాష్ట్రం వెలుపల నివసిస్తున్నారని, అందువల్ల కేవలం జనాభాపై ఆధారపడటం సాధ్యం కాదు కాబట్టి మరో పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. ఇక ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రాలలో ఎమ్మెల్యే సీట్లు కూడా పెరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) చేసిన సూచనతో తాను కూడా ఏకీభవిన్నానని విజయసాయి రెడ్డి వెల్లడించారు.