ఆ గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం.. హెచ్‌సీయూ భూ వివాదంపై రేవంత్ రెడ్డి ఫైర్
గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు హెచ్ సీయూ కి చెందిన భూమి కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు హెచ్‌సీయూ కి చెందిన భూమి కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) జోరుగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్‌సీయూ భూముల వివాదం (HCU Land Issue) గురించి స్పందించారు. రేవంత్ మాట్లాడుతూ.. గచ్చిబౌలి (Gachibouli)లో ఉన్న భూమి గురించి కొందరు నాయకులు మాట్లాడుతున్నారని, ఆ భూమిని ఏం చేయోద్దని చెబుతున్నారని తెలిపారు.
దాదాపు 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే ప్రైవేట్ వ్యక్తికి, ఆయన సంస్థకు ప్రభుత్వం ఆ భూమి కేటాయించిందని, అప్పటి నుండి హెచ్‌సీయూ వద్ద ఆ భూమి లేదని చెప్పారు. అనంతరం 2006లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూ కేటాయింపును రద్దు చేసిందని, అప్పటి నుంచి ఆ భూమి వ్యవహారం కోర్టులలో ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) గత పదేళ్లలో ఆ భూమిని తీసుకోవడానికి ప్రయత్నించలేదని, తాము అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టుకు వెళ్లి కేసు గెలిచి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రస్తుతం ఆ భూమిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నామని, టీజీఐఐసీ కి కేటాయించడమే గాక ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు వచ్చేందుకు లేఅవుట్ లు వేయాలని సూచించడం జరిగిందన్నారు.
అభివృద్ధి కోసం కేటాయించిన భూమిలో రిజర్వ్ ఫారెస్ట్ (Reserve Forest) ఉన్నట్లు, ఆ ఫారెస్ట్ లో జీవరాశులు ఉన్నట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడ పులులు, సింహాలు లేవని, కొన్ని గుంటనక్కలు ఆ భూమి చుట్టూ చేరి ఇలా వ్యవహరిస్తున్నాయని, గుంటనక్కలకు గుణపాఠం చెబుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ భూమి వందశాతం అభివృద్ధి జరుగుతున్న ఏరియాలో ఉందని, అందుకే అభివృద్ధి కోసమే ఉపయోగిస్తున్నామని తెలిపారు. అంతేగాక ఆ భూమిని పెట్టుబడుల కోసం కేటాయించామని, అంతర్జాతీయ సంస్థల ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు కేటాయిస్తే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.