మ్యాన్ హోల్‌కు యునిక్ ఐడీ నెంబర్..

గ్రేటర్ హైదరాబాద్‌లోని కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు, ఓఆర్ఆర్ గ్రామాలు ఇలా జలమండలి పరిధిలో ఉన్న నీటి సరఫరా, సీవరేజీ పైపులైన్లు, మ్యాన్ హోళ్లు, ఎయిర్‌టెక్ మిషెన్లు, సిల్ట్ కార్టింగ్ వాహనాలు ఇలా అన్నింటి పర్యవేక్షణకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని జలమండలి నిర్ణయించింది.

Update: 2024-12-12 02:07 GMT

దిశ, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లోని కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు, ఓఆర్ఆర్ గ్రామాలు ఇలా జలమండలి పరిధిలో ఉన్న నీటి సరఫరా, సీవరేజీ పైపులైన్లు, మ్యాన్ హోళ్లు, ఎయిర్‌టెక్ మిషెన్లు, సిల్ట్ కార్టింగ్ వాహనాలు ఇలా అన్నింటి పర్యవేక్షణకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని జలమండలి నిర్ణయించింది. వీటన్నింటి పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా డాష్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మ్యాన్ హోళ్లకు యునిక్ ఐడీ నెంబర్ ఇవ్వాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి నిర్ణయించారు. ఇది అవినీతి అరికట్టేందు తీసుకుంటున్న చర్యల్లో భాగమేనని ఆయన చెబుతున్నారు.

యునిక్ ఐడీ నెంబర్ ఎందుకు ?

జలమండలి పరిధిలో 6 లక్షలకు పైగా మ్యాన్ హోల్స్ ఉన్నాయి. కోర్ సిటీలో 3 లక్షలు ఉన్నాయి. అయితే వీటిని గతంలో ఇష్టాను రీతిలో నిర్మించారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుకు ఎత్తు పెంచడం, మరిన్ని ప్రాంతాల్లో మ్యాన్ హోల్‌ను ఇటుకలతో నిర్మించి ప్లాస్టరింగ్ చేయకుండానే రోడ్డు వేయడం, ఇంకొన్ని ప్రాంతాల్లో మ్యాన్ హోల్‌కు పైకప్పు లేకపోవడం, పూర్తిగా మూసుకుపోవడం వంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దీంతో పాటు వర్షాకాలం వచ్చిందంటే మరమ్మతులు చేస్తూనే ఉంటారు. పనులు నాసిరకంగా చేయడంతో పదేపదే మరమ్మతులు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి యునిక్ ఐడీ నెంబర్‌తో చెక్ పెట్టడానికి అవకాశముంది. ‘అసలు మ్యాన్ హోల్ ఏ ప్రాంతంలో ఉంది. ఎప్పుడు నిర్మించారు. ఎన్నిసార్లు మరమ్మతులు చేశారు. ఎన్ని నిధులు ఖర్చు చేశారు. ఏ కాంట్రాక్టర్ పనులు చేశారు’ అనే విషయాలన్నింటిని పొందుపరిచే విధంగా ఐడీ నెంబర్‌ను రూపొందించాలని నిర్ణయించారు.

ఎయిర్‌టెక్ మిషిన్లు, సిల్ట్ కార్టింగ్ ఆటోలకు జీయో ఫెన్సింగ్..

జలమండలి పరిధిలో 220 ఎయిర్‌టెక్ మిపెన్లు, 140 సిల్ట్ కార్టింగ్ ఆటోలు ఉన్నాయి. ఎయిర్‌టెక్ మిషన్లు ఎక్కడ పనిచేస్తున్నాయనే విషయం పై స్పష్టతకరువైంది. ప్రజల ఫిర్యాదుల పై స్పందించిన క్షేత్రస్థాయి అధికారులు బడా హోటళ్లు, వ్యాపార కేంద్రాలకు పనులు చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఎయిర్‌టెక్ మిషన్‌కు కేటాయించిన ఏరియా ఏంటి ? ఎక్కడ విధులు నిర్వహిస్తోంది ? రోజుకు ఎన్ని కిలోమీటర్ల పైపులైన్‌ను క్లీన్ చేసింది ? అనే అంశాల పై నిఘా పెట్టాలని జలమండలి నిర్ణయించింది. వీటితో పాటు సిల్ట్ కార్టింగ్ ఆటోలు సైతం పరిధి దాటిపోతున్నట్టు అధికారులు గుర్తించారు. వీటికి సైతం పరిధిని నిర్ణయించడంతో పాటు కేటాయించిన ఏరియాలో విధులు నిర్వహించే విధంగా జియో ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించారు. ఈ రెండు వాహనాలను డాష్ బోర్డుకు అనుసంధానం చేసి పర్యవేక్షించనున్నారు.

ట్యాంకర్ బుకింగ్‌లోనూ మార్పులు..

ట్యాంకర్ బుకింగ్‌లోను జలమండలి మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఓ కస్టమర్ ట్యాంకర్ బుక్ చేస్తే అనివార్య కారణాల వల్ల ఆ బుకింగ్ క్యాన్సిల్ చేసే అవకాశం లేదు. ఓ బుక్ చేశారంటే డబ్బులు చెల్లించాల్సిందే. దీన్ని మార్పు చేయాలని కస్టమర్ల నుంచి భారీగా డిమాండ్ ఉంది. అయితే ట్యాంకర్ బుక్ చేసిన కస్టమర్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా కల్పించాలని జలమండలి నిర్ణయించింది. అంతేకాదు బుకింగ్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా ఇవ్వనుంది.


Similar News