పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి : తెలంగాణ గవర్నర్
పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు.
దిశ, రవీంద్రభారతి : పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలో పీవీ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు, సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పీవీ సోదరుడు పీవీ మనోహర్ రావు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ మెమోరియల్ అవార్డును కాళోజీ శిష్యుడైనటువంటి ప్రముఖ కవి భాస్కర్, సావిత్రి దంపతులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. పీవీ, కాళోజీ గురు శిష్యుల బంధం అని, ఇరువురు ఒకరినొకరు గౌరవించుకుంటారని పేర్కొన్నారు. పీవీ 16 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడన్నారు. సోషలిస్టు భావాలు కలిగిన నేత అని, ఆయన అమలు చేసిన భూ సంస్కరణలు రాజకీయ మౌలిక స్వభావాన్ని మార్చేసాయన్నారు. తెలంగాణ శాసనసభాపతి
గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. పీవీ దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించారన్నారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి విద్యా ను అన్ని వర్గాల వారికి అందించిన మహానేత పీవీ అని ఆయన అన్నారు. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజా కవి కాళోజీ అని, పీవీ కాళోజీ ఒకరినొకరు గౌరవించుకునేవారని ఆయన తెలిపారు. పీవీ ప్రభాకర్, పీవీ శరత్ బాబు, ఎన్ వి సుభాష్ లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు విజయబాబు, సీఎస్బీ అకాడమీ డైరెక్టర్ బాలాలత, పీవీ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.