ఆరాంఘర్ నుంచి జూపార్కు మార్గంలో రయ్.. రయ్

గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు స్టాటజిక్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్ఆర్డీపీ) ద్వారా చేపట్టిన ఫ్లై ఓవర్లు ఒక్కొక్కటీ అందుబాటులోకి వస్తున్నాయి.

Update: 2025-01-06 03:18 GMT

దిశ, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు స్టాటజిక్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్ఆర్డీపీ) ద్వారా చేపట్టిన ఫ్లై ఓవర్లు ఒక్కొక్కటీ అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీ ద్వారా 42 పనులలో ఇప్పటి వరకు 36 పనులు పూర్తయ్యాయి. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు చేపట్టిన ఆరులేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్‌గా అందుబాటులోకి రానున్నది. ఈ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి జనవరి 6న ప్రారంభించనున్నారు.

4 కిలో మీటర్లు..ఆరు లేన్లు..

నగరంలో పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ తర్వాత రెండో ఫ్లై ఓవర్‌గా నిలుస్తుంది. 23 వ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానున్నది. రూ.799.4 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 4 కిలోమీటర్ల పైబడిన పొడవు గల 6 లేన్ల ఫ్లై ఓవర్‌ను చేపట్టారు. ప్రధాన ఫ్లై ఓవర్ పనులు పూర్తి అయినందున సీఎం జనవరి 6 ప్రారంభించనున్నారు. ఇంతకు ముందు బైరమల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్‌ను సీఎం ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఆ మార్గాలకు ఉపశమనం..

ఆరాంఘర్ - జూపార్కు ఫ్లై ఓవర్ అందుబాటులో రావడంతో సికింద్రాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లా, హుజురాబాద్, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్‌గిరి వాసులకు శంషాబాద్ విమానాశ్రయం వరకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిగ్నల్ ఫ్రీ రవాణాకు వెసులుబాటు కలదు. ఉప్పల్ నుంచి నాగోల్, కామినేని, ఎల్బీనగర్ జంక్షన్, బైరమల్‌గూడ, (ఓవైసీ జంక్షన్) అబ్దుల్ కలాం ఫ్లైఓవర్, చాంద్రాయణ్‌గుట్ట ఫ్లైఓవర్ ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేగంగా నిర్దేశించిన సమయంలో చేరాల్సిన గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు తక్కువ ఇంధన వాడకం, కాలుష్య రహితంగా వెళ్లేందుకు వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు ఫ్లై ఓవర్లు దోహదపడతాయని చెప్పవచ్చు.

ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన అతిపెద్ద ఫ్లై ఓవర్‌..

అంతే కాకుండా ఇమ్లిబన్ బస్ స్టేషన్ నుంచే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రవేటు బస్సులు ఇతర వాహనాలు రోజుకు 1,700 నుంచి 2,000 వరకు రోజు ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయి. ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా వెళ్లేందుకు ఆరు లేన్ల అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్‌లో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ 4 లైన్ల ఫ్లైఓవర్ కాగా ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ఆరు లైన్లతో 4 కిలోమీటర్ల పైగా పొడవుతో చేపట్టగా ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన అతిపెద్ద ఫ్లై ఓవర్‌గా నిలుస్తుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రధాన ఫ్లైఓవర్‌ను ప్రారంభించడంతో వాహనదారులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ ఫ్లై ఓవర్‌కు సంబంధించిన మిగతా పనులు ఇరువైపులా ర్యాంపులు, సర్వీస్ రోడ్డు వచ్చే మార్చి, 2025 వరకు పూర్తి చేసేందుకు అవసరమైన మేరకు అన్ని చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎస్ఆర్డీపీ పనులు యుద్ధప్రాతిపదికన డిసెంబర్ 2025 వరకు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన 42 పనులలో 22 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్‌లు, 6 ఆర్ఓబీలు మరో మూడు వివిధ రకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

రూ.7,032 కోట్లతో..

ప్రజాపాలన - ప్రజా ప్రభుత్వంలో హైదరబాద్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి గావించే నేపథ్యంలో రాష్ట్ర సీఎం హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేకదృష్టి సారించారు. ఈ నేపథ్యంలో హైద్రాబాద్‌లో వ్యూహాత్మక పథకాలను ఒకే గొడుగు కిందికి తెచ్చి సమగ్ర ప్రగతి సాధించేందుకు హెచ్ - సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్నోవేటివ్) ద్వారా రూ.7,032 కోట్లతో 38 పనులను చేపట్టేందుకు పరిపాలన అనుమతి ఇచ్చారు. ఈ నిధులతో సుమారు 38 పనులు చేపట్టనున్నారు. ఆయా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న కేబీఆర్ పార్కు నలుదిక్కులా 6 జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లేందుకు ప్రతి జంక్షన్ వద్ద ఒక అండర్ పాస్‌తో కలిసి మొత్తం ఏడు ఫ్లై ఓవర్‌లు, మరో ఆరు అండర్ పాసుల నిర్మాణాలు పూర్తయితే హైదరాబాద్ రూపులేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకు ప్రజా ప్రభుత్వంలో ఏడాదిలోపు పూర్తి చేసేందుకు టెండర్ పక్రియ త్వరలో పూర్తి చేసి పనులను కూడా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.


Similar News