2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఓయూ విద్యార్థినేత మోతిలాల్ నాయక్ ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం నిరుద్యోగులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు.

Update: 2024-06-29 11:53 GMT

దిశ,కార్వాన్ : 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఓయూ విద్యార్థినేత మోతిలాల్ నాయక్ ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం నిరుద్యోగులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ గ్రౌండ్ కి తరలించారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. మోతిలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తీవ్ర అనారోగ్యం పాలైనట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు పై ఉన్న శ్రద్ధ మోతిలాల్ నాయక్ ఆరోగ్యం పై లేకపోవడం దురదృష్టకరమన్నారు. అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీని అశోక్ నగర్ చౌరస్తాలో టీ తాగించి డ్రామా ఆడి నిరుద్యోగులను రెచ్చగొట్టి

    వారి ద్వారా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేయడం అత్యంత హేయమని పేర్కొన్నారు. ఆ రోజు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోని జాబ్ కేలండర్ లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్-2లో 2,000 వరకు గ్రూప్-3లో 3,000 వరకు పోస్టులు పెంచాలన్నారు. గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్ప త్తి ప్రాతిపాదికన అభ్యర్థులను పిలవాలన్నారు. దీంతో పాటు 11 వేలున్న డీఎస్సీ పోస్టులను 25 వేలకు పెంచాలన్నారు. రూ.4,000 నిరుద్యోగ భృతి ఇచ్చి డిసెంబర్ లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, బీసీ జన సభ రాష్ట్ర నాయకులు తొడంగి గోవర్ధన్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ ముదిరాజు, శ్రీ కృష్ణ యాదవ సంఘం యాదద్రి జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేశం యాదవ్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీరాం శరత్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి బాత్క అశోక్ యాదవ్, బోల్లు నరసింహ యాదవ్, రాజశేఖర్ యాదవ్ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. 

Similar News