1200 ఎకరాలల్లో 800 మంది రైతుల గోడు...

అధికారుల నిర్లక్ష్యంతో ఆరేళ్లుగా రైతుబంధు, రైతుబీమా, రుణాలకు దూరం రైతు పేరు 'అడవి', తండ్రి పేరు 'అడవి' ఖాతాలను తొలగించి కొత్త పట్టాపాస్ పుస్తకాలివ్వాలని సచివాలయం ముందర నారాయణపురం రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు.

Update: 2024-07-01 09:39 GMT

దిశ, ఖైరతాబాద్ : అధికారుల నిర్లక్ష్యంతో ఆరేళ్లుగా రైతుబంధు, రైతుబీమా, రుణాలకు దూరం రైతు పేరు 'అడవి', తండ్రి పేరు 'అడవి' ఖాతాలను తొలగించి కొత్త పట్టాపాస్ పుస్తకాలివ్వాలని సచివాలయం ముందర నారాయణపురం రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులము. తమ గ్రామంలో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పట్టాభూములను 2017లో ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో 1827 ఎకరాల భూమిని అటవీభూములుగా పేర్కొంటూ పట్టాలను రద్దు చేసింది. 2384 జీవో నెంబరు ప్రకారం నారాయణపురం గ్రామంలోని భూములను 2021, ఫిబ్రవరిలో రెవెన్యూ పట్టాభూములుగా గుర్తించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జూన్, 2021లో ఎంజాయిమెంట్ సర్వే చేశారు. మే, 2022లో ధరణిలో నారాయణపురం రైతుల వివరాలను చేర్చినప్పుడు రైతు పేరు 'అడవి', రైతు తండ్రి పేరు 'అడవి' అని నమోదు చేశారు. దాంతో తాము సీసీఎల్ఎ వద్ద పలుమార్లు నిరసన వ్యక్తం చేయగా 700 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. ఈ పట్టాదారు పాసుపుస్తకాలు 'ట్రూ కాపీ' అని ముద్రించి ఉండడంతో బ్యాంకులో రుణాలు ఇవ్వడం లేదు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరణిలో 950 ఎకరాలు 250 ఖాతాల్లో రైతు పేరు 'అడవి', రైతు తండ్రి పేరు 'అడవి' అని నమోదు చేశారు. దీంతో సేత్వార్ ఆర్ఎస్ఆర్ హెచ్చుతగ్గులు ఉండడంతో 'టీఎం33' మాడ్యుల్లో దరఖాస్తు చేసుకోగా జిల్లా కలెక్టర్ అప్రూవల్ చేశారు. ఈ దరఖాస్తులన్నీ సీసీఎల్ఎలో రైతు పేరు 'అడవి'గా నమోదు చేసిన ఖాతాలను తొలగిస్తే అసలైన రైతులకు పట్టాపాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఈ విషయంపై రెండేళ్లుగా సీసీఎల్ , రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా తొలగించకుండా జాప్యం చేస్తున్నారు. ఈ గ్రామానికి 2017 నుంచి అధికారుల నిర్లక్ష్యంతో రైతుబంధు, రైతు బీమా అమలు కాకుండా కోట్ల రూపాయల నిధులు రైతులకు అందకుండా పోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నారాయణపురంలో సుమారు 1200 ఎకరాల్లో 800 మంది రైతులకు ఎంజాయిమెంట్ సర్వే నివేదిక ప్రకారం పట్టాపాస్పుస్తకాలు ఇవ్వాలని నారాయణపురం రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం ఎంపీటీసీ దారావత్ రవి, ఉప సర్పంచ్ శంకర్, రైతులు వెంకన్న, రాజేష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News