మోత మోగిపోతున్న ఎగ్జామ్ ఫీజులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజులు భారంగా మారాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజులు భారంగా మారాయి. ఇతర వర్సిటీలతో పోలిస్తే రెట్టింపు ఫీజు ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓయూ పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో రెగ్యులర్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు రూ.2660గా ఉంది. బ్యాక్ లాగ్ సెమిస్టర్ ఫీజు నాలుగు పేపర్లలోపు రూ.1620గా ఉంది. అయితే జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో రెగ్యులర్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు రూ.955 ఉంటే.., బ్యాక్ లాగ్ సెమిస్టర్ ఫీజు ఒక్క సబ్జెక్టుకు రూ.365గా ఉంది. రెండు సబ్జెక్టులకు రూ.615, మూడు సబ్జెక్టులకు రూ.840, 4, ఆపై సబ్జెక్టులకు రూ.955 ఎగ్జామ్ ఫీజుగా నిర్ణయించారు.
కానీ.. ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఒక్క సబ్జెక్టు బ్యాక్ లాగ్ ఉన్నా.. 4 పేపర్లు ఉన్నా ఒకే ఫీజు చెల్లించాల్సి వస్తోంది. మరోపక్క కేయూ రెగ్యులర్ సెమిస్టర్ ఫీజు రూ.1200 ఉండగా, బ్యాక్ లాగ్ సెమిస్టర్ ఫీజు మూడు పేపర్ల వరకు రూ.1100, రెండు పేపర్లకు రూ.600గా ఉంది. మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలోని కాలేజీలో రెగ్యులర్ ఫీజు రూ.1300 ఉండగా, బ్యాక్ లాగ్‌లో మూడు పేపర్ల వరకూ రూ.760, ఆ పై పేపర్లకు రూ.1300 ఎగ్జామ్ ఫీజు ఉంది. ఇతర వర్సిటీలతో పోలిస్తే.. ఓయూ పరిధిలో భారీగా ఫీజులు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు తగ్గించాలని విద్యార్థులు.. వర్సిటీ అధికారులు, ఉన్నత విద్యామండలి అధికారులను కలిసినా ఫలితం లేకుండాపోయింది.