హైకోర్టు కొత్త బిల్డింగ్ డిజైన్ ఫైనల్.. త్వరలో అధికారిక ప్రకటన

తెలంగాణ నూతన హైకోర్టు బిల్డింగ్ డిజైనుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు తెలుస్తున్నది.

Update: 2024-09-28 02:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నూతన హైకోర్టు బిల్డింగ్ డిజైనుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం(హైకోర్టు) కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన డిజైను చీఫ్ జస్టిస్ ఓకే చేయగా.. అందుకు రాష్ట్ర సర్కారు సై అన్నట్టు కీలకంగా తెలిసింది. ఈ విషయం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆర్ అండ్ బీ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాతే నిర్మాణపు పనులు ప్రారంభం అవుతాయని స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ ప్రకటన ప్రభుత్వం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. అందుచేత, ఫైనల్ అయిన కొత్త హైకోర్టు డిజైన్ ను బహిర్గతం చేసేందుకు అధికారులు జంకుతున్నారు. ఈ విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు.

సీజే ఫైనల్ చేసిన డిజైన్‌కు సీఎం సమ్మతి!

ప్రస్తుత హైకోర్టు నిజాం పాలన సమయంలో నిర్మించిందని, రానున్న రోజుల్లో జడ్జీల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా తెలంగాణకు నూతన హైకోర్టు భవనం నిర్మించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో మొత్తం తొమ్మిది డిజైన్లకు తొలుత రాగా, నాలుగు డిజైన్లను న్యాయమూర్తుల కమిటీ ఓకే చేసింది. ఇందులో నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోల్ ఆరాధేతో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు దాసరి హరిచందన, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు భేటీ అయి, ఫైనల్ డిజైన్‌ను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తితో ఓకే చేయించారు. రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు, ఒక ప్రైవేటు ఆర్కిటెక్ట్ కన్సల్టెన్సీ సంయుక్తంగా మొత్తం తొమ్మిది డిజైన్లు రూపొందించగా, అందులో నుంచి న్యాయమూర్తుల కమిటీ నాలుగింటికి ఓకే చేసింది. అయితే, ఈ నాలుగు డిజైన్ల నుంచి ఒక్కదాన్ని ఫైనల్ చేసేందుకు ఆర్ అండ్ బీ అధికార యంత్రాంగం పని చేసి.. హైకోర్టు న్యాయమూర్తితో మంతనాలు జరిపి ఒకటి ఫైనల్ చేసుకున్నది. సీజే అలోక్ ఆరాధే ఫైనల్ చేసిన డిజైన్‌ను సీఎం, ఆర్ అండ్ బీ శాఖ మంత్రికి చూపించినట్టు తెలిసింది. అందుకు ఇరువురి దగ్గరి నుంచి సమ్మతి లభించినట్టు తెలిసింది. త్వరలో ఈ విషయాన్ని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించి.. నిర్మాణ సంబంధిత అంశాల్లో ముందుకు వెళ్లనున్నది.

రూ.వెయ్యి కోట్ల బడ్జెట్.. 18 నెలల్లో పూర్తి కానున్న నిర్మాణం

రాజేంద్రనగర్‌ మండలంలోని వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల వద్ద కేటాయించిన 100 ఎకరాల స్థలంలో నూతన హైకోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. హైకోర్టు భవనం, జడ్జీలకు నివాస భవనాలు, బార్ కౌన్సిల్ ఆఫీసు, అడ్వకేట్లకు లైబ్రరీ, పోలీసు, సెక్యూరిటీ సిబ్బిందితో పాటు మొత్తం 40 బిల్డింగులు నిర్మించేందుకు అన్ని పరిశీలనల తర్వాత డిజైన్లను ఈ ఫైనల్ డిజైనులో ఖరారు చేశారు. హైకోర్టు నూతన భవనం నిర్మాణ డిజైన్లను అందించేందుకు 19 ఆర్కిటెక్ట్‌ కంపెనీలు ముందుకు రాగా, భవన శంకుస్థాపన తర్వాత హైకోర్టు బిల్డింగ్‌ కమిటీ.. నిర్మాణానికి ఒక కంపెనీను ఎంపిక చేశారు. ఎంపికైన కంపెనీ డిజైన్లను రూపొందించి బిల్డింగ్‌ కమిటీకి అందించింది. వాటిలో నుంచి ఒక డిజైన్‌ను కమిటీ సెలక్ట్‌ చేసి ప్రభుత్వానికి అందజేస్తుంది. అనంతరం నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తారు. నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖ నిర్వహిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), న్యాయకోవిదుడు డీవై చంద్రచూడ్‌ తెలంగాణ హైకోర్టు కొత్త భవనం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమానికి పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, ఇతర న్యాయమూర్తులు అప్పుడు హాజరయ్యారు. అయితే, అప్పుడు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున రాజకీయ నాయకులు ఎవరూ పాల్గొనే అవకాశం లేకపోయింది. హైకోర్టు నూతన భవనాన్ని వందేండ్లపాటు పటిష్ఠంగా ఉండే విధంగా నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. దాదాపు రూ.వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌తో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసే విధంగా అధికారులు రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు ప్రస్తుతం కేటాయించిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా, భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోన్నది. అందుచేత, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు హాళ్లను నిర్మించాల్సి ఉంటుందని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు.


Similar News