వరుస సెలవులు.. కిక్కిరిసిన జేబీస్ బస్టాండ్

సికింద్రాబాద్ లోని జేబీస్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది.

Update: 2024-08-15 12:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ లోని జేబీస్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. ఈరోజు నుండి సోమవారం వరకు వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో ప్రజలు, విద్యార్థులు సొంతూళ్ళ బాట పట్టారు. విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రావడంతో జేబీస్ నుండి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలకు వెళ్ళే బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ముందే టికెట్స్ బుక్ చేసుకోవడంతో, రిజర్వేషన్ లేని వారు గంటలు గంటలు బస్టాండ్ లో పడి గాపులు కాయాల్సి వచ్చింది. సరిపడా బస్సులు లేక చిన్న పిల్లలతో వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక గురువారం ఉదయం నుండే సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. అన్ని రైళ్లు జనంతో కిక్కిరిసి పోయాయి. ఇక స్వంత వాహనాలతో ఊళ్ళకు వెళ్ళే వారితో టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అయితే వరుస సెలవుల కారణంగా ఊళ్ళకు వెళ్ళే వారిని పోలీసులు అలర్ట్ చేశారు. డబ్బు, బంగారం వంటి విలువైన వస్తువులు ఇంట్లో పెట్టి వెల్లవద్దని సూచించారు.  


Similar News