Revanth Reddy : కేసీఆర్ బాస్ ఆయనే.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్‌కు బాస్ నరేంద్ర మోడీనే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం గురించి నిజామాబాద్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ బయటపెట్టారని కేసీఆర్‌కు బాస్ నరేంద్ర మోడీనే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందూరు సభలో ప్రధాని వ్యాఖ్యలపై బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని ధ్వజమెత్తారు.
ఈ రెండు పార్టీలది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉందని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ 9, బీజేపీ 7, ఎంఐఎం1 స్థానాల్లో కలిసి పోటీ చేయబోతున్నాయని బీఆర్ఎస్ ఎంపీలే నాకు చెప్పారని అన్నారు. ఈ పొత్తుల బండారం బయటపడిందనే కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని అనేక సర్వేలు చెబుతున్నాయని అందువల్లే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే మోడీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శాలువాలే కాదు బీఆర్ఎస్ దోపిడీలో వాటా
తెలంగాణలో కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోడీని ఆయన దర్బారులో సన్మానం చేశారని శాలువాలు, పూలదండలు మాత్రమే కాదు బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయని అందుకే కేసీఆర్‌పై మోడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పదేళ్ళలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోడీ అపహాస్యం చేశారని మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోడీ చెప్పాల్సిందన్నారు. కేసీఆర్‌కు నీళ్లు అంటే.. కవిత కన్నీళ్లు, నిధులు అంటే దోపిడీ సొమ్ము, నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలని అసదుద్దీన్ ఓవైసీ ఎవరికి మద్దతు ఇస్తారో తేల్చుకోవాలన్నారు. బీజేపీతో దోస్తీ కట్టిన బీఆర్ఎస్‌కా? బీజేపీ, బీఆర్ఎస్‌ను ఓడించాలంటున్న కాంగ్రెస్‌కా? నిర్ణయించుకోవాలన్నారు.
హరీష్ రావు చర్చకు రావాలి..
బీఆర్ఎస్ వాళ్లు జైలుకు వెళ్లే టైమ్ వచ్చిందని అందువల్లే ప్రజల దృష్టి మళ్లించేందుకే నేను అరెస్ట్ అవుతారంటూ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌కు పదేళ్లు నేను చేసిన అభివృద్ధి.. గడిచిన ఐదేళ్లలో వాళ్లు చేసిన అభివృద్ధిపై చర్చకు మంత్రి హరీష్ రావు రావాలన్నారు. తాను ఏబీవీపీలో పని చేశానని ఇదంతా అందరికీ తెలిసిందే అన్నారు.