రాయితీ అవకాశం ఇంకా 9 రోజులే.. పెరుగుతున్న అనుమానాలు, సందేహాలు
లే అవుట్ రెగ్యులరైజ్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారంలో అనుమానాలు, సందేహాలు, సమస్యలు పెరుగుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: లే అవుట్ రెగ్యులరైజ్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారంలో అనుమానాలు, సందేహాలు, సమస్యలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం ఫీజు రాయితీతో పలువురు ముందుకొస్తున్నారు. దీంతో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దరఖాస్తుదారులకు పంపిన లింకు ఓపెన్ కావడంలేదు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ పరిధిలో తలెత్తిన సాప్ట్‌వేర్ సమస్యలను అధికారులు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశం ఇంకా 9 రోజులే ఉండడంతో ఫీజు చెల్లించేందుకు అధిక సంఖ్యలో ప్రయత్నం చేస్తున్నారు.
1.25 లక్షల మంది..
రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సుమారు నిషేధిత భూములు, చెరువులు, కుంటలు, నీటి వనరులకు సంబందించి 4 లక్షల దరఖాస్తులను తిరస్కరించినట్టు అధికారులు చెబుతున్నారు. మరో 1,25,732 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. మరో 18,60,421 దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లను పంపించారు. మిగిలిన వాటికి చిన్నచిన్న కారణాల వల్ల ఫీజు ఇంటిమేషన్ లెటర్లు వెళ్లలేదని అధికారులు చెబుతున్నారు. వాటికి సైతం త్వరలోనే లెటర్లు పంపించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రూ.460 కోట్ల ఆదాయం..
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.460 కోట్ల ఆదాయం వచ్చింది. ఫీజు చెల్లించిన 1,25,732 దరఖాస్తుల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాల్లో 20,037, మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 14,740, హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీల్లో 13,619 దరఖాస్తులు ఉన్నాయి. అయితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన ఫీజును ఎక్కడికక్కడే మున్సిపాలిటీలకు వెళ్లేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇంత వరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో ఫీజుకు సంబంధించిన డబ్బులు ప్రభుత్వ ఖాతాలోనే జమ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఉత్తర్వుల కోసం మున్సిపాలిటీ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని పలువురు కమిషనర్లు కోరుతున్నారు.
25.70 లక్షల దరఖాస్తులు ఇలా..
రాష్ట్ర వ్యాప్తంగా 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో హెచ్‌ఎండీఏ పరిధిలో 3,58,464, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,06,921 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.82 లక్షలు, గ్రామాల్లో 6 లక్షలు, అర్బన్‌డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,991, తుర్కయాంజల్ మున్సిపాలిటీలో 50,411, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 47,506, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో 42,231 ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 39,944, నల్లొండ మున్సిపాలిటీలో 36,116, సూర్యపేటలో 35,464 దరఖాస్తులు వచ్చాయి.