గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం.. అభ్యర్థుల కన్నీళ్లు.. సీఎం రేవంత్ ట్వీట్

గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Update: 2024-10-21 08:30 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జరుగుతుందో లేదోనన్న సందిగ్ధంపై సుప్రీం తీర్పుతో క్లారిటీ వచ్చింది. పరీక్షను చివరి నిమిషంలో వాయిదా వేయడం కుదరదని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం.. ఫలితాలు వచ్చేలోగా తుది తీర్పు ఇవ్వాలని తెలంగాణ హై కోర్టును ఆదేశించింది. సుప్రీం తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. పరీక్షలు యథావిధంగా జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవ్వగా.. అభ్యర్థుల్ని 1.30 గంటల వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఒక్క నిమిషం లేటుగా వచ్చిన అభ్యర్థుల్ని గేటు బయటే ఆపివేయడంతో.. అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు. చాలా కష్టపడి చదివాం సర్.. ప్లీజ్ గేట్లు తీయండి అని అభ్యర్థులు రోధిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బేగంపేటలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థినిని లోపలికి అనుమతించకపోవడంతో గోడదూకగా.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

గ్రూప్ -1 పరీక్షలు రాసే అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎక్స్ లో ట్వీట్ చేశారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా.. పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. ఈ పరీక్షల్లో విజయం సాధించి.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కాగా.. రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీకి నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గ్రూప్ -1 మెయిన్స్ (Group-1 mains) పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 46 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా.. 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ విధించారు.


Similar News