నిరుద్యోగులకు శుభవార్త.. రేపే కొత్త పోస్టులతో రీ నోటిఫికేషన్
తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, ఇటీవలే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కొత్త చైర్మన్‌గా నియమించింది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన టీఎస్పీఎస్సీ రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే అంశంలో భాగంగా.. నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. గతంలో పలు కారణాలతో రద్దైన గ్రూప్-1 నోటిఫికేషన్ ను, కొత్త పోస్టులతో కలిపి రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది.
గత ప్రభుత్వం 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయగా, ప్రస్తుతం దానికి మరో 97 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులతో రీ నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తొంది. దీనికి సంబందించి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 పోస్టుల వివరాలు తెలపాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయగా, టీఎస్పీఎస్సీలో జరిగిన పేపర్ లీకులు, పరీక్ష నిర్వహణలోని లోపాలు తదితర కారణాల వల్ల రెండు సార్లు పరీక్ష రద్దు అయ్యింది. గత ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి ఈ తప్పిదం కూడా ఒక కారణం అయ్యిందని చెప్పవచ్చు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, జాబ్ క్యాలెండర్ అమలు, గతంలో నిర్వహించిన పరీక్షల్లోని నిర్వాహన లోపాలను సరిదిద్ది, కొత్త నోటిఫికేషన్లతో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తి అవ్వగా, జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు కసరత్తులు చేస్తూనే.. కొత్త నోటిఫికేషన్లు కూడా జారీ చేసే దశగా అడుగులు వేస్తొ్ంది.