ఇప్పటికైనా బాధ్యతగా ఉండాలి: సినీ నటులకు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ చురకలు
సినీ నటులకు ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ చురకలు అంటించారు..
దిశ, వెబ్ డెస్క్: హీరో అల్లు అర్జున్(Allu Arjun is the hero) నటించిన పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్(Sandya Theatre) దగ్గర జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాటలో తల్లి రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అయితే శ్రీతేజ్‌ను ఆదివారం CPI కార్యదర్శి కె.రామకృష్ణ(CPI Secretary K. Ramakrishna), తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్, ఈ.టీ నరసింహ పరామర్శించారు. శ్రీతేజ్‌కి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని రామకృష్ణకు వైద్యులు తెలిపారు.
అనంతరం ఆస్పత్రి బయట రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటన బాధాకరమని, భవిష్యత్తులో పునరావృతం కాకూడదంటే ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతివ్వకూడదన్నారు. తెలంగాణ సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇక నుంచి ఏ సినిమాకైనా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వమని చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి ఫౌండేషన్ ద్వారా శ్రీతేజ్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. కేవలం లాభార్జన కోసం మాత్రమే సినిమాలు తీసి ఎటువంటి సామాజిక బాధ్యత లేకుండా కొంతమంది నటులు ప్రవర్తిస్తున్నారని, వారి తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా సినిమా నటులు, దర్శక, నిర్మాతలు బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉందని రామకృష్ణ పేర్కొన్నారు.