CM Revanth Reddy: రీజినల్ రింగు రోడ్డు అనుమతులు ఇవ్వండి : నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్
రీజినల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : రీజినల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి సమావేశమయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్ తో అనుసంధానించే ఎన్.హెచ్-765(NH765)లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని, మిగిలిన 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ అటవీ(Amrabad Forest) ప్రాంతంలో ఉందని తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్(Elivated Carridor) నిర్మిస్తే హైదరాబాద్(Hyderabad), ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్-విజయవాడ (NH-65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ఈ రహదారి విస్తరణ పనులు పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన వారమవుతామని చెప్పారు. తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్-63 (16) వరంగల్, హన్మకొండ నగరాల మధ్యగా వెళుతోందని.. ఈ రహదారిని నగరం వెలుపల నుంచి నాలుగు చోట్ల కలుపుతూ బైపాస్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
పర్వత మాల ప్రాజెక్ట్ లో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని, నల్గొండ జిల్లాల్లో ఎన్.హెచ్-65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, మల్లు రవి, కడియం కావ్య, ఎం. అనిల్ కుమార్ యాదవ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.