రైతు హీర్యా నాయక్‌కు బేడీల ఘటన.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
రైతు హీర్యా నాయక్‌కు బేడీలు వేసిన ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసింది.
దిశ, వెబ్‌దడెస్క్: రైతు హీర్యా నాయక్‌కు బేడీలు వేసిన ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. హీర్యానాయక్ బేడీల ఘటనపై విచారణ ముగిసింది. సుమారు నాలుగు గంటల పాటు వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ఐజీ సత్యనారాయణ విచారించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతు చేతులకు బేడీలు వచ్చాయని అన్నారు. జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని.. నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారని నిర్ధారించారు.
హీర్యా నాయక్‌ను కూడా లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదు. బాలానగర్‌లోని ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్నట్లు గుర్తించారు. ఉద్దేశ పూర్వకంగా చేశారా? లేక పొరపాటున చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. ‘ఏ2 సురేష్ జైల్లో నుంచి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు. హీర్యా నాయక్‌కు గుండెనొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పారు. అసలు సురేష్ ఫోన్‌లో మాట్లాడింది ఎవరితో అనే దానిపై ఆరా తీస్తున్నాం. ఈ కేసులో నిర్లక్ష్యం చేసిన అందరికీ కఠిన చర్యలు తప్పవు’ అని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.