బ్యాంకు రుణాలు ఇప్పిస్తామంటూ ఘరానా మోసం
బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలు చేస్తున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలు చేస్తున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ ప్రాంత నివాసి మీర్జా ఖాదర్ బేగ్ అలియాస్ సమర్(35) రియల్టర్. కాగా, తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో కొంతకాలంగా మోసాలకు తెర లేపాడు. ఈ క్రమంలో కాల్‌సెంటర్‌ను ప్రారంభించి లేడీ టెలీకాలర్స్‌ను పెట్టుకుని ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి ఫోన్లు చేయించేవాడు. కోటి నుంచి మొదలుకుని ఎంత మొత్తంలో అయినా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తామని చెప్పించేవాడు.
ఎవరైనా ఈ మాటలు నమ్మి సంప్రదిస్తే వారి నుంచి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజు అంటూ లక్షల రూపాయలు వసూలు చేసుకునేవాడు. తొంభై నుంచి నూటా ఇరవై రోజుల లోపు రుణాలు ఇప్పిస్తానని చెప్పి ఆ గడువు తీరగానే కాల్‌సెంటర్‌ను మూసేసి మరోచోట ప్రారంభించేవాడు. ఈ నేపథ్యంలో అతనిపై జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పోలీస్స్టేషన్లలో ఇరవై ఒక్క కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు సీసీఎస్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ స్టేషన్లో వరకట్న వేధింపులు కూడా ఖాదర్‌బేగ్ పై ఉన్నాయి. వేర్వేరు కేసులకు సంబంధించి ఖాదర్బేగ్పై పదకొండు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయి ఉన్న నేపథ్యంలో సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐ రఘునాథ్ ఎస్సై నవీన్ కుమార్‌తో పాటు సిబ్బందితో కలిసి అతన్ని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.