Telangana: కలెక్టర్లలో టెన్షన్! గత టార్గెట్లను పూర్తి చేయని మెజార్టీ అధికారుల్లో గుబులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ (శుక్రవారం) సెక్రటేరియట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ (శుక్రవారం) సెక్రటేరియట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, సమావేశంపై (Telangana collectors) కలెక్టర్లలో టెన్షన్ మొదలైంది. గతంలో సీఎం ఇచ్చిన టార్గెట్స్‌ను మెజార్టీ కలెక్టర్లు పూర్తి చేయలేదని తెలుస్తోంది. ముఖ్యంగా గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై రేవంత్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే గురుకులాలను విధిగా సందర్శించాలని, మెస్‌లను తనిఖీ చేయలని ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే కలెక్టర్లు గురుకులాలను సదర్శిస్తున్నా.. కొంతమంది అధికారులు మాత్రం సీఎం ఆదేశాలను పాటించలేదని తెలుస్తోంది. అదేవిధంగా పలువురు అధికారులు సీఎం ఆదేశాలను పక్కన పెట్టి జిల్లాలో తమ సొంత ఎజెండాను అమలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ భూముల రక్షణలో వైఫల్యం..
తెలంగాణలోని పలు పట్టణాల్లో విలువైన భూములు కబ్జాలకు గురువుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది నాయకులు, అధికారుల అండదండలతో భూములు ఆక్రమించుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ భూముల రక్షణలో అధికారులు వైఫల్యం చెందినట్లు ప్రభుత్వానికి నిఘా వర్గాల సమాచారం అందినట్టు తెలుస్తోంది. రియల్టర్లతో అధికారులు క్లోజ్‌గా ఉంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలతో కొంతమంది అధికారులు ఇంకా టచ్‌లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డికి నిఘా వర్గాల నివేదిక అందించినట్లు తెలిసింది. దీంతో సమావేశంలో సీఎం ఏమంటారోనని కలెక్టర్లు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.