కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవారిపై కేసు పెట్టాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి కోరారు.

Update: 2023-09-07 14:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవారిపై కేసు పెట్టాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి కోరారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి రాజీవ్ కుమార్‌కు గురువారం లేఖ రాశారు. తెలంగాణలో డబ్బు, మద్యం ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని, డబ్బు ఖర్చు చేసే వారికే టికెట్లు ఇవ్వడంతో ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారన్నారు. దీంతో మధ్యతరగతి, విద్యావంతులు ఎన్నికలకు దూరంగా ఉండటంతో చట్ట సభల్లో సగం కంటే ఎక్కువ మంది ధనికులు, నేర చరిత్ర ఉన్నవారు ఉంటున్నారన్నారు.

తెలంగాణలో పోటీ చేసేవారు రూ.10కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో పట్టుకున్న డబ్బు నామమాత్రపు విచారణతో తిరిగి వాపసు చేస్తున్నారని అన్నారు. పలు సందర్భాల్లోనూ ఆ డబ్బును ఆదాయపన్నుశాఖకు అప్పగిస్తే దానిపై పన్ను కట్టించుకొని మిగిలిన డబ్బు వాపస్ చేస్తున్నారన్నారు. ఇలా ఎన్నికల్లో పట్టుబడిన డబ్బుపై విధి విధానాలు లేకపోవడంతో ఎవరూ పంపిణీ సమయంలో భయపడటం లేదన్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎవరూ రూ.25వేలకు మించకుండా తిరుగొద్దని, ఎవరైనా ఎక్కువ డబ్బుతో పట్టుబడితే కేసు నమోదు చేసి కోర్టులో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నికలకు రెండు నెలలకు ముందుగానే విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు, మద్యం, విలువైన వస్తువులు పంచిన సందర్భాల్లో బరిలో నిలిచిన అభ్యర్థిపై కేసు నమోదు చేయాలని కోరారు.

ఎన్నికలకు ముందు రోజూ మాత్రమే మద్యం అమ్మకాలపై నిషేధం ఉందని, అలా కాకుండా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి పోలింగ్ ముగిసేవరకు నిషేధం విధించాలన్నారు. మంత్రుల అధికారిక పర్యటన ఎన్నికల ప్రచారంతో కలుపొద్దన్నారు. మంత్రుల ప్రచారం సందర్భంగా ప్రభుత్వ వాహనాలు గానీ, ఇతర సిబ్బందిని గాని ఉపయోగించకుండ చూడాలని, ఎన్నికల్లో లబ్ది పొందడానికి అధికారిక పార్టీ చేసిన పనులను ప్రభుత్వ ఖర్చుతో పత్రికల్లో, టీవీల్లో ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Tags:    

Similar News